
ఉన్నంతలో అదే ఊరట!
దాదాపు మూడేళ్ళకు పైగా వార్తల్లో నిలిచి, ఇటీవలే విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమ సింహ’గా విడుదలైంది) ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తోంది.
దాదాపు మూడేళ్ళకు పైగా వార్తల్లో నిలిచి, ఇటీవలే విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమ సింహ’గా విడుదలైంది) ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తోంది. కాకపోతే, ఇప్పుడీ సినిమాపై సానుకూల వార్తల కన్నా ప్రతికూల వార్తలదే పైచేయి అయింది. మోషన్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీలో తీసిన ఈ ఆధునిక సాంకేతిక ప్రయత్నం ఆశించిన స్థాయిలో ఎవరినీ ఆకట్టుకోలేకపోయిందని సినీ వాణిజ్య వర్గాలు తేల్చేస్తున్నాయి. తెలుగులోనే కాక, అడ్వాన్స్ బుకింగ్ జోరు తగ్గాక తమిళంలోనూ అంతంత మాత్రపు ఆదరణకే పరిమితమైంది.
‘అవతార్’ లాంటి చిత్రాల స్థాయికి చేరలేక, ‘ఏదో యానిమేషన్ సినిమా చూసినట్లుంద’న్న పెదవి విరుపులకు గురైంది. అయితే, రజనీకాంత్ సినిమా కావడం, అందులోనూ తండ్రి నటించిన సినిమాకు కుమార్తె దర్శకత్వం వహించడమన్నది ఇదే తొలిసారి కావడం, ఆధునిక టెక్నాలజీ వాడడం లాంటివన్నీ ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకొనేలా చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, ఆధునిక టెక్నాలజీ వాడకంలో తమిళనాట ముందుండే నట - దర్శకుడు కమలహాసన్ ఆదివారం నాడు ‘కోచ్చడయాన్’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూశారు. రజనీకాంత్ కుమార్తె, చిత్ర దర్శకురాలు సౌందర్యా రజనీకాంత్ అశ్విన్ వ్యక్తిగతంగా ఆహ్వానించి మరీ, కమల్ కోసం ప్రైవేటుగా ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఇటీవలే కాన్స్ చిత్రోత్సవానికి వెళ్ళొచ్చి, ప్రస్తుతం తమిళ చిత్రం ‘ఉత్తమ విలన్’ షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్న కమల్‌హాసన్, ‘విశ్వరూపం’లో తన సరసన నటించిన పూజా కుమార్‌తో కలసి ‘కోచ్చడయాన్’ చూశారు. గతంలో పలు చిత్రాల్లో రజనీకాంత్‌తో కలసి నటించి, ఆనక తెరపై రజనీకి దీటుగా నిలిచిన కమల్ ఈ సినిమాను ఆస్వాదించడమే కాక, తొలి చిత్రంలోనే ఈ స్థాయి ప్రయోగం చేసినందుకు సౌందర్యను అభినందించినట్లు అభిజ్ఞవర్గాల కథనం. మొత్తానికి, సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందన్నది పక్కనపెడితే, తన తండ్రికి సమకాలికుడైన సినీ దిగ్గజం నుంచి ఆ మాత్రం అభినందనలు రావడం సౌందర్యకు కాస్తంత ఊరటే! కానీ, కోట్లు వెచ్చించి సినిమా ప్రదర్శన హక్కుల్ని కొనుగోలు చేసినవారి ఊరట మాటేమిటి చెప్మా!