నిజానిదే గెలుపు

Kabilan Vairamuthu casts doubts over MeToo - Sakshi

‘‘చదువుకునే రోజుల్లో ఇంట్లో తినడానికి తిండి లేకపోతే మా నాన్నగారు తోటల్లో రెండు టమాటా పండ్లు కోసుకుని తిని, పరీక్షలకు వెళ్లిన రోజులు ఎవరికీ తెలియవు. కాలేజీ ఫీజు 150 రూపాయలు కట్టడానికి అప్పు కోసం ఎన్ని ఊళ్లు తిరిగి, ఎన్ని అవమానాలు భరించారో ఎవరికీ తెలియదు. హైస్కూల్‌కి వెళ్లేవరకూ కాళ్లకు చెప్పులు లేకుండా రాళ్లు, ముళ్లు గుచ్చుకున్నా లెక్కచేయక వెళ్లి చదువుకున్న రోజులు తెలియవు. అమ్మా, నాన్నలది ప్రేమ వివాహం. ఒక్క ఫ్యాన్‌ వసతి కూడా లేని ఇంట్లో ఒకరు తమిళ టీచర్‌గా, ఒకరు కవిగా ఇద్దరు కన్నబిడ్డల ఆలనా పాలనా చూసుకోవడానికి పడిన తిప్పలు తెలియవు.

ఒక మారుమూల గ్రామం నుంచి నగరానికి వచ్చి, దేశంలో ఉన్న ప్రముఖుల్లో ఓ ప్రమఖుడిగా ఎదిగిన మా నాన్న గురించి ఈ ‘టెక్నాలజీ యువత’కు ఏం తెలుసు? ఎంతో ఎత్తుకి ఎదిగిన నాన్నగారి జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయం. ఆయన అందుకోని అవార్డులు లేవు. ప్రశంసలు లేవు. అలాంటి ఆయన కీర్తి ప్రతిష్టలకు మకిలి పట్టించడానికి ప్రయత్నిస్తున్నవారిని చూస్తే జాలిగా ఉంది’’ అని ‘నిజానిదే గెలుపు’ అంటూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనయుడు, రచయిత కబిలన్‌ ట్వీటర్‌లో ఓ సుదీర్ఘ లేఖను పొందుపరిచారు.

వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చి దాదాపు 15 రోజులు పైనే అయింది. ‘‘ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు స్పందించడానికి కారణం ఇంత సుదీర్ఘంగా రాసే మానసిక స్థితి లేకపోవడమే’’ అన్నారు కబిలన్‌. ‘‘ఆధారాలు లేకుండా పురుషులను స్త్రీలు, స్త్రీలను పురుషులు నిందించడం అనే ఈ ట్రెండ్‌ చాలా ప్రమాదకరమైనది. మన దేశం ప్రధాన బలం మన కట్టుబాట్లు. అవి ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కొంతవరకూ మనల్ని కాపాడటానికి కారణమయ్యాయి. పాశ్చాత్య ప్రభావం మెల్లిగా మన కుటుంబ కట్టుబాట్ల నాశనానికి కారణమవుతోంది.

మా నాన్నగారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం వెనక పొలిటికల్‌ ఎజెండా ఉందని కొందరు, అలాంటిదేమీ లేదని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమన్నా చట్టపరమైన చర్యల ద్వారా న్యాయం జరుగుతుందన్నది నా అభిప్రాయం. ఈ మొత్తం సమస్య (ఆరోపణలు) ఓ మెగా ఈవెంట్‌లా అయిపోయింది. అది మనల్ని దేశంలో ఎన్నో ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తోంది. ‘మీటూ’ అంటూ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమం ఏ దిశలో వెళుతోందో చెప్పేంత పరిపక్వత నాకు లేదు’’ అంటూ పలు విషయాలు పంచుకున్నారు.

ఈ ట్వీట్‌ని వైరముత్తు మరో కుమారుడు, కబిలన్‌ సోదరుడు మదన్‌ కార్కీ రీ–ట్వీట్‌ చేశారు. అయితే కబిలన్‌ ట్వీట్‌కి పలు విమర్శలు వచ్చాయి. ‘‘మా నాన్నగారు అన్ని కష్టాలు పడ్డారు.. ఇన్ని కష్టాలు పడ్డారు అని చెప్పావు కానీ, మా నాన్న నిజాయితీపరుడు, మా అమ్మకు ద్రోహం చేయలేదు. ఏ అమ్మాయి దగ్గరా తప్పుగా ప్రవర్తించలేదని బలంగా చెబుతున్నాను అని మీరు చెప్పకపోవడానికి కారణం మీ మనసాక్షి ఒప్పుకోకపోవడమే’’ అని కొందరు విమర్శించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top