పాట విని రణ్‌వీర్‌ డాన్స్‌ చేశారు

Jeeva Seeru Movie Press Meet - Sakshi

చెన్నై : సీరు చిత్రంలోని పాటను బాలీవుడ్‌ నటుడు రణ్‌ వీర్‌సింగ్‌ అడిగి మరీ విని డాన్స్‌ చేశారని నటుడు జీవా చెప్పారు. ఈయన నటించిన తాజా చిత్రం సీరు. వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ నిర్మించిన ఇందులో నటుడు వరుణ్‌ ముఖ్య పాత్రలో నటించారు. టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో జీవాకు జంటగా రియా సుమన్‌ నటించింది. ఈ బ్యూటీకిదే తొలి తమిళ చిత్రం. నటి గాయత్రీ కృష్ణన్, చాందిని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రతన్‌శివ దర్శకత్వం వహించారు. డీ.ఇమాన్‌ సంగీతాన్ని అందించిన సీరు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది.
 చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. నిర్మాత ఐసరి గణేశ్‌ మాట్లాడుతూ సీరు తమ సంస్థతో రూపొందిన నాల్గో చిత్రమన్నారు. సీరు చిత్రం కూడా సక్సెస్‌ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రతన్‌శివ చెప్పిన కథ నచ్చిందన్నారు. ఆయన చెప్పిన కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. తన చిత్రం అయినా నచ్చక పోతే చెప్పే స్తానన్నారు. ఈ చిత్రం తన మనసుకు హత్తుకుందన్నారు. చిత్రం కోసం జీవా చాలా శ్రమించినట్లు చెప్పా రు. నటుడు వరుణ్‌ ఈ చిత్రం కోసం తనను మార్చుకున్నాడని అన్నా రు. మంచి కథా చిత్రాలనే అందించాలన్నది తమ లక్ష్యం అని నిర్మాత ఐసరి గణేశ్‌ పేర్కొన్నారు. నటుడు జీవా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రం నిర్మించడం కంటే దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం పెద్ద విషయంగా మారిందన్నా రు. ఇక్కడ చాలామంది మీడియా ప్రతినిధులు ఉన్నారని, చిత్రం బాగోలేకపోతే సంకటంగా ఉంటుందని అన్నారు. అయితే చాలామంచి విషయాలు జరుగుతున్నాయన్నారు. మనసుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

సీరు చిత్రంలో తాను కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా నటించినట్లు చెప్పారు. చిత్ర కథనం హట్టహాసంగా ఉంటుందన్నారు. దర్శకుడు రతన్‌శివ కథ చెప్పడంతో దిట్ట అని అన్నారు. ఆయన ఎవరినైనా కథ చెప్పి  ఓకే అనిపించగలరని అన్నారు. ఇది పక్కా కమర్శియల్‌ కథా చిత్రంగా ఉంటుందన్నా రు.  బాలీవుడ్‌ నటు డు రణ్‌వీర్‌సింగ్‌ 83 చిత్ర ప్రమోషన్‌ కోసం చెన్నైకి వచ్చినప్పుడు సీరు చిత్రంలోని కచేరి కచేరి అనే పాటను అడిగి మరీ విని ఆ పాటుకు డాన్స్‌ చేశారని చెప్పారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు డీ.ఇమాన్‌ను అభినంధించారని తెలిపారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్‌ సంగీతం పక్కా బలమని పేర్కొన్నారు. తనకు ఇందులోని వాసూకీ అనే పాట చాలా నచ్చిందన్నారు. నటి చాందిని నటించిన సన్నివేశాలు బాగా వచ్చాయన్నా రు. సీరు చిత్రంలో నటుడు వరుణ్‌ నటించిన పాత్రలో ఆయన్ని వద్దని తాను ముందు చెప్పానన్నారు. కారణం అది చాలా రష్‌ పాత్ర అని, అందులో వరుణ్‌ నటించి అదరగొట్టారని కితాబిచ్చారు. నటి రియా సుమన్‌ ఇంతకు ముందు జిప్సీ చిత్రం అడిషన్‌లో పాల్గొన్నట్టు చెప్పిందని, అయితే తను హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రమే జిప్సీ కంటే ముందు విడుదల కానుందని జీవా అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు రతన్‌శివ, నటి చాందిని, వరుణ్, డీ.ఇమాన్‌ తదితర చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top