హీరోయిన్లకు ఆ హీరో లక్కీ ..! | Heroine Sayesha Saigal acts with Karthi  | Sakshi
Sakshi News home page

హీరోయిన్లకు ఆ హీరో లక్కీ ..!

Nov 4 2017 8:58 PM | Updated on Nov 4 2017 9:06 PM

Heroine Sayesha Saigal acts with Karthi  - Sakshi

బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు తాజాగా దిగుమతి అయిన ఏంజల్‌ నటి సాయేషా సైగల్‌. కోలీవుడ్‌లో హీరోయిన్లకు లక్కీ హీరో జయంరవి అనే పేరుంది. మొదటిసారి ఆయనతో రొమాన్స్‌ చేసిన హీరోయిన్లకు అదృష్టం తేనె తుట్టెలా పడుతుందని అంటారు. రవి తొలి చిత్ర హీరోయిన్‌ సదా, శ్రియ, అశిన్‌ ఇలా చాలామంది ప్రముఖ హీరోయిన్లుగా రాణించారు. ప్రస్తుతం ఈ వరుసలో నటి సాయేషా సైగల్‌ చేరింది.

ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలీవుడ్‌ బ్యూటీ జయం రవికి జంటగా వనమగన్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం యాజరేజ్‌ అనిపించుకున్నా సాయేషాకు మాత్రం బోలెడంత పేరు వచ్చింది. ఆ వేంటనే ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్‌, కార్తీతో నటించడానికి సిద్ధమైన కరుప్పరాజా- వెళ్లరాజా చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం వాయిదా పడింది.

అది సాయేషాకు చిన్న షాక్‌ అనే చెప్పాలి. అయితే ఆమెకు అదృష్టం చేజారలేదు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ కథా చిత్రం ‘జూంగా’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు మరో స్టార్‌ హీరో కార్తీతో రొమాన్స్‌ చేసే అవకాశం తలుపు తట్టిందన్నది తాజా సమాచారం. కార్తీ నటించిన తాజా చిత్రం ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 17న విడుదలకు ముస్తాబవుతోంది.

ఆ తరువాత పసంగ పాండిరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అన్నయ్య, నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో కార్తీకి జంటగా ఇంతకు ముందు నటి ప్రియ భవానీశంకర్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్ర హీరోయిన్‌ సాయేషాసైగల్‌ను వరించినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి డి. ఇమాన్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఈ అమ్మడు హీరో అక్కినేని అఖిల్‌ మొదటి చిత్రం అఖిల్‌లో నటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement