వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి | Harish Rao And Venkatesh Chief Guest For MisMatch Pre Release Event | Sakshi
Sakshi News home page

వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి

Dec 4 2019 12:01 AM | Updated on Dec 4 2019 12:01 AM

Harish Rao And Venkatesh Chief Guest For MisMatch Pre Release Event - Sakshi

‘‘ఇప్పుడు సినిమాల్లో కొత్త భావనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, నూతన దర్శకులు, నటీనటులు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ‘మిస్‌ మ్యాచ్‌’ కూడా అదే కోవలో కనపడుతోంది’’ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉదయ్‌ శంకర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా ఎన్‌.వి. నిర్మల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. జి. శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో హరీశ్‌రావు మాట్లాడుతూ– ‘‘స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రమిది. ఓ ప్రేమికురాలి విజయం కోసం ప్రేమికుడు పడే తపనను చూపిస్తుంది. సినిమాల్లో మంచి సందేశం ఉండి గౌరవం పెరగాలి.

వ్యక్తిత్వం ప్రతిబింబించేలా, మహిళల గౌరవం పెరిగేలా సినిమాలుండాలి. ‘మిస్‌ మ్యాచ్‌’ సినిమా సమాజంతో మ్యాచ్‌ అయి మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘ఉదయ్‌శంకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐశ్వర్యా రాజేష్‌ అమ్మగారు నాతో పాటు 50–60 సినిమాలకు కలిసి పనిచేశారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో ఐశ్వర్య తెలుగులో సిక్సర్‌ కొట్టింది. ఈ సినిమాలో తను ఆడే ఆటతో బాక్సాఫీస్‌ బద్దలవుతుంది’’ అన్నారు. హీరో వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘అమ్మాయిలు ఉన్నత స్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్టపడతాను. ఆ తరహాలో ఉండే ‘రాజా, సూర్యవంశం’ వంటి సినిమాల్లో నేను కూడా నటించాను. ‘మిస్‌ మ్యాచ్‌’ తప్పకుండా పెద్ద సక్సెస్‌ కావాలి’’ అన్నారు.

‘‘నేను గురువుగా భావించే శ్రీరామ్‌సార్‌గారి తనయుడి చిత్రోత్సవానికి రావడం సంతోషంగా భావిస్తున్నా’’ అన్నారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘‘సగటు సినిమా ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఉదయ్‌ శంకర్‌. ‘‘ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్‌. ‘‘తెలివైన అబ్బాయి.. పల్లెటూరి అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అన్నారు నిర్మల్‌ కుమార్‌. ‘‘మంచి కథతో రూపొందించిన చిత్రమిది’’ అన్నారు జి. శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ) దేశపతి శ్రీనివాస్, తెలంగాణ ఎఫ్‌.డి.సి. చైర్మన్‌ రామ్మోహనరావు, నిర్మాత కె.ఎల్‌. దామోదర ప్రసాద్, రచయిత భూపతి రాజా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిఫ్టన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement