అంతేనా..వదంతేనా! | Director Lokesh Kangaraj About Vijay 64 | Sakshi
Sakshi News home page

అంతేనా..వదంతేనా!

Jun 2 2019 10:02 AM | Updated on Jun 2 2019 10:02 AM

Director Lokesh Kangaraj About Vijay 64 - Sakshi

నటుడు విజయ్‌ నటిస్తున్న చిత్రం అంటేనే ఆసక్తితో పాటు అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతం విజయ్‌ తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకుడు. అగ్రనటి నయనతార కథానాయకి. ఏజీఎస్‌ సంస్థ భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు తెరి, మెర్శల్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు రావడంతో తాజా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్‌ 64వ చిత్రం గురించి రకరకాల ప్రచారం జోరందుకుంది. విజయ్‌ చిత్రానికి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నారని, లేదూ దర్శకుడు అరుణ్‌రాజా కామరాజ్‌ క్యూలో ముందు వరుసలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్‌ తదుపరి చిత్రానికి దర్శకుడు విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది. దీనికి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇది పిల్లలను సైతం అలరించే ఫ్యాంటసీ ఇతివృత్తంతో జనరంజకంగా తెరకెక్కనున్నట్లు తెలిసింది.

ఇకపోతే ఈ మూవీలో విజయ్‌తో రొమాన్స్‌ చేసే ఆ లక్కీ హీరోయిన్స్‌ ఎవరన్న విషయంలోనూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ముందుగా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలిగిపోతున్న శాండిల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన నటించబోతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. నిజానికి ఈ అమ్మడు విజయ్‌ 63వ చిత్రంలోనే నటించనున్నట్లు వదంతులు పరుగులు తీశాయి. అయితే అందులో నయనతార ఎంపికయ్యారు.

తాజాగా విజయ్‌ 64వ చిత్రంలో నటింపజేయడానికి రష్మికతో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో తాజాగా నటి త్రిష పేరు వెలుగులోకి వచ్చింది. విజయ్, త్రిషలది హిట్‌ పెయిర్‌ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు గిల్లి, కురువి చిత్రాల్లో నటించారు. అదీగాక ఇటీవల నటి త్రిష మళ్లీ 96, పేట చిత్రాల విజయంతో ప్రైమ్‌ టైమ్‌లోకి వచ్చారు. దీంతో విజయ్‌ తాజా చిత్రంలో నటి త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర వర్గాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

అసలు విషయం ఏమిటంటే విజయ్‌ 64వ చిత్రానికి దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారన్న విషయం మాత్రమే వాస్తవమని, ఇతరత్రా అంతా వదంతులేనట. ఈ విషయాన్ని దర్శకుడే చెప్పారు. నటుడు విజయ్‌ నటిస్తున్న 63వ చిత్ర షూటింగ్‌ పూర్తి అయిన తరువాత తదుపరి చిత్రంలో నటించే హీరోయిన్, ఇతర విషయాల గురించి ఆయన, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామని దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తెలిపారు. ఇంతకీ విజయ్‌ కొత్త చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే ఆ లక్కీ హీరోయిన్‌ ఎవరో తెలయాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement