దీపిక వెడ్డింగ్‌ కూడా అక్కడే!

Deepika Padukone Wedding Details - Sakshi

ముంబై : బాలీవుడ్‌ ప్రేమజంట దీపికా పదుకోన్‌- రణ్‌వీర్‌ సింగ్‌ పెళ్లి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. నవంబరు 14, 15 తేదీల్లో తాము వివాహ బంధంతో ఒక్కటి కానున్నామని ఇరువురూ పెళ్లి తేదీని కూడా ప్రకటించేశారు. విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ మాదిరే ఈ జంట కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశారట.  

హాలీవుడ్‌ సెలబ్రిటీల ఫేవరెట్‌ ప్లేస్‌, అత్యంత ఖరీదైన హాలీడే స్పాట్‌ ఇటలీలోని లేక్ కోమో వీరి పెళ్లికి వేదిక కానుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఉత్తర ఇటలీలోని లంబార్డీ ప్రాంతంలో మైమరిపించే ప్రకృతి సోయగాల నడుమ ఈ సరస్సు ఉండటంతో వివాహ వేదికగా ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నట్టు తెలిసింది. సరస్సు చుట్టూ నిర్మించిన విల్లాలు అతిధులకు విడిదిగా మారనున్నాయి. మరోవైపు ఆల్ప్‌ పర్వత శ్రేణులు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా చెబుతున్నారు.

అలాగే వధువు దీపికా ధరించే వస్త్రాలను ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ రూపొందించనున్నారట. ఢిల్లీకి చెందిన ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ ఇప్పటికే అక్కడికి చేరుకుని షెడ్యూల్‌ తయారు చేసేస్తున్నట్లు తెలిసింది. నవంబరు 13న సంగీత్‌తో మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజులపాటు కొనసాగుతాయట. అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకకు హాజరవుతారని సమాచారం. ఇక బాలీవుడ్‌ నుంచి డైరెక్టర్‌ సంజయ్‌ లీలా బన్సాలీ, అర్జున్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌ వంటి కొంత మంది ప్రముఖులు మాత్రమే లోకో కోమో చేరుకోనున్నారట. కాగా భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ కూడా లోకో కోమోలో జరిగిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top