సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య

Bollywood Young actor Sushant Singh Rajput commits suicide - Sakshi

ముంబైలోని నివాసంలో ఉరివేసుకున్న యువ నటుడు  

బలవన్మరణానికి గల కారణాలపై పోలీసుల అన్వేషణ

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కన్నుమూశారు. ఆయన ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. యువ నటుడి బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. మెడికల్‌ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సుశాంత్‌సింగ్‌ కేవలం 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడం పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్‌ రాజధాని పాట్నాకు చెందిన ఆయన తొలుత టీవీ సీరియళ్లలో నటించారు. అనంతరం హిందీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సుశాంత్‌కు తండ్రి, నలుగురు అక్కలు ఉన్నారు. తల్లి 2002లో మరణించారు. ఆయన మాజీ మేనేజర్‌ దిశా సలియాన్‌(28) జూన్‌ 9న ఓ బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.  

ఇంజనీరింగ్‌ మధ్యలోనే ఆపేసి...
ఢిల్లీ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ విద్యార్థి అయిన సుశాంత్‌సింగ్‌ మధ్యలోనే చదువు ఆపేశారు. కొరియోగ్రాఫర్‌ షియామక్‌ దేవర్‌ వద్ద నృత్యంలో శిక్షణ పొందారు. 2006లో విడుదలైన ధూమ్‌ 2 సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కొంతసేపు కనిపించారు. 2009లో ప్రసారమైన పవిత్ర రిస్తా సీరియల్‌లో నటించారు. 2011లో కై పో చే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. శుద్ధ్‌ దేశీ రోమాన్స్, రాబ్తా, కేదార్‌నాథ్, ఎంఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ, చిచోరీ తదితర చిత్రాల్లో నటించారు. క్రికెటర్‌ ధోనీ బయోపిక్‌ అయిన ఎంఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ చిత్రం సుశాంత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. చివరిసారిగా 2019లో చిచోరే చిత్రంలో వెండితెరపై కనిపించారు. సుశాంత్‌ అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. బంధువులు పట్నా నుంచి ముంబైకి చేరుకుంటున్నారు.  

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ప్రకాశ్‌ జవదేకర్, సినీ నటులు షారుక్‌ ఖాన్, అనిల్‌కపూర్, కరణ్‌ జోహార్, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తదితరులు సంతాపం ప్రకటించారు. ప్రతిభావంతుడైన నటుడు దూరం కావడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top