
అనుష్కకు జాక్‌పాట్!
సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌ల కాంబినేషన్‌లో ఇంతకు ముందు ముత్తు, పనయప్ప వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి
సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌ల కాంబినేషన్‌లో ఇంతకు ముందు ముత్తు, పనయప్ప వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్న కోచ్చడయాన్ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతల్ని నిర్వహించారు. సూపర్ స్టార్, కె.ఎస్.రవికుమార్‌ల కాంబినేషన్ రిపీట్ కానుందన్నది తాజా సమాచారం.
కోచ్చడయాన్ చిత్ర ఆడియో ఈ నెల తొమ్మిదిన, చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానున్నాయి. దీంతో రజనీకాంత్ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. స్టార్ డెరైక్టర్ శంకర్ రజనీతో ఎందిరన్ - 2 తెరకెక్కించనున్నారని, ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ ఆనంద్ కూడా సూపర్ స్టార్ కోసం సూపర్ కథను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది.
ఈ మధ్యలో రజనీ ఓకే అంటే చంద్రముఖి-2 తీయడానికి తాను రెడీ అంటూ దర్శకుడు పి.వాసు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిలో రజనీకాంత్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో భారీ చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ఇంతకుముందు కె.ఎస్.రవికుమార్ వద్ద సహాయక దర్శకుడిగా పని చేసి, ఆ తర్వాత ప్రియమణి హీరోయిన్‌గా చారులత చిత్రానికి దర్శకత్వం వహించిన పొన్‌కుమరన్ రజనీ కోసం పక్కా కమర్షియల్ కాక్‌టైల్ కథను తయారు చేశారట. దీన్ని కె.ఎస్.రవికుమార్ రజనీకి వినిపించారట. కర్ణాటకకు చెందిన రజనీ చిరకాల మిత్రుడు రాక్‌లైన్ వెంకటేశ్ ఈ భారీ బడ్జెట్ బొనాంజా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అనుష్కకు జాక్‌పాట్
అందాలతార అనుష్క జాక్‌పాట్‌ను కొట్టేసిందనే టాక్ ప్రచారం అవుతోంది. ఇంతకు ముందు సూపర్ స్టార్‌తో నటించే రెండు చాన్సులను మిస్ అయ్యిందట. ఈసారి రజనీ, కె.ఎస్.రవికుమార్‌ల చిత్రంలో హీరోయిన్ అనుష్కనేనని సమాచారం.