కేజీఎఫ్‌ క్రేజ్‌కు.. మాటమార్చిన అమెజాన్‌ ప్రైమ్‌ | Amazon prime shocks with KGF craze | Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌ క్రేజ్‌కు.. మాటమార్చిన అమెజాన్‌ ప్రైమ్‌

Feb 4 2019 3:54 PM | Updated on Feb 4 2019 4:23 PM

Amazon prime shocks with KGF craze - Sakshi

కన్నడ సినీ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచిన తాజా సంచలనం 'కేజీఎఫ్‌' క్రేజ్‌కు డిజిటల్‌ ఫ్లాట్‌ ఫాం దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ మాటమార్చింది. గ‌త ఏడాది క్రిస్మ‌స్ వీకెండ్లో విడుద‌లైన 'కేజీఎఫ్‌' ఇంకా అక్క‌డ‌క్క‌డా థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. కన్నడ పరిశ్రమలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ 230 కోట్లకుపైగా రాబట్టింది. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్‌ మెరుగైన వసూళ్లు సాధించింది. షారుక్‌ ఖాన్‌ జీరో, రణ్‌వీర్‌ సింగ్‌ల సింబా సినిమాలను తట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ కూడా దాదాపు రూ 40 కోట్లు వసూలు చేయడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. కేజీఎఫ్‌ అనూహ్య విజయంతో రాకింగ్ స్టార్ యష్‌కు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 

థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న సమయంలోనే కేజీఎఫ్‌ను డిజిటల్‌ ఫ్లాట్‌ ఫాంలో మంగళవారం విడుదల చేయడానికి అమెజాన్‌ ప్రైమ్‌ సన్నాహాలు చేసింది. ఫిబ్రవరి 5నుంచి కన్నడ, తమిళ్‌, తెలుగు, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. అయితే ఎలాగూ చిత్రాన్ని విడుదల చేస్తూన్నామని భావించి అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ రెండు రోజుల ముందుగానే అమెజాన్‌ ప్రైమ్‌ ఓ ట్వీట్‌ చేసింది. 5000 రీట్వీట్‌లు చేస్తే చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంచుతామని తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అయితే కేజీఎఫ్‌కు ఉన్న క్రేజ్‌కు అభిమానులు కొద్ది సమయంలోనే ఐదు వేల రీట్వీట్లు చేశారు. దీంతో కంగుతిన్న అమెజాన్‌ ప్రైమ్‌, ఇక్కడ మాకు ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటే బాగుండు మిత్రమా అంటూ ట్విట్టర్‌ అధికారిక అకౌంట్‌ను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది. అంతేనా ముందు చేసిన ట్వీట్‌ తాలూకూ స్క్రీన్‌ షాట్‌ను ఎడిట్‌ చేసి... 5000ల రీట్వీట్‌లు చేస్తే విడుదల కాదు.. కేవలం రిలీజ్‌ తేదీని మాత్రమే ప్రకటిస్తామంటూ మాటమార్చింది. దీంతో నెటిజన్లు తమ క్రియేటివిటీని జోడించి అమెజాన్‌ ప్రైమ్‌ను ఓ ఆట ఆడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement