అవినీతిపై రజనీ పోరాటం
రజనీకాంత్ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది. తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఆయన నటించిన ‘కొచ్చాడయాన్’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రజనీకాంత్ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది. తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఆయన నటించిన ‘కొచ్చాడయాన్’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం. తెలుగులో ఈ సినిమా ‘విక్రమసింహా’ పేరుతో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే... మూడేళ్ల క్రితం వచ్చిన ‘రోబో’ కానీ, రానున్న ‘విక్రమసింహా’ కానీ... సాంకేతికంగా మాత్రమే ఉన్నతమైన సినిమాలు. కథా వస్తువు పరంగా సమాజానికి అవి ఆమడదూరం. రజనీలోని మాస్ యాంగిల్‌ని ఆవిష్కరింపజేసే సినిమాలు అవి కానేకావు. ఓ విధంగా ‘శివాజీ’ తర్వాత మాస్ మెచ్చే పాత్ర రజనీ చేయలేదు.
ఆ లోటును భర్తీ చేయడానికే దర్శకుడు శంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనం కోసం పోరాడే నిజమైన నాయకుడిగా రజనీని చూపించబోతున్నారాయన. ఈ లైన్ రజనీకాంత్‌కి కూడా విపరీతంగా నచ్చేసిందట. ప్రస్తుతం ‘ఐ’ చిత్రం షూటింగ్‌లో ఉన్న శంకర్... మరోవైపు రజనీకాంత్ కోసం అనుకున్న లైన్‌ని కథగా మార్చే పనిలో ఉన్నారు. ‘శివాజీ’లో విద్యావ్యవస్థ తీరుపై రజనీ పోరాటం చేస్తే... ప్రస్తుతం తయారవుతున్న కథలో అవినీతి, లంచగొండితనాన్ని టార్గెట్ చేస్తారట. రకరకాల సామాజిక అంశాలను ప్రస్తావించేలా ఈ కథాంశం ఉంటుందని సమాచారం. ఓ సామాన్యుడు తలచుకుంటే ఏం జరుగుతుందో తెలియజెప్పేలా ఈ కథాంశం ఉంటుందట. శివాజీ, రోబో చిత్రాలతో అద్భుతాలు సృష్టించిన ఈ కాంబినేషన్ ఈ కథ ద్వారా రేపు ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో వేచిచూడాలి.