ఎవరీ హక్కానీ?

Who is this jalaluddin Haqqani? - Sakshi

అగ్రరాజ్యం ఆర్థిక అండతో కీలక నేతగా ఎదిగాడు. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. ఆక్రమిత ఆఫ్గనిస్తాన్‌ను సాధించడంలో  కీలక భూమికి పోషించాడు. లాడెన్‌కు మద్దతిచ్చి అమెరికా ఆగ్రహానికి గురయ్యాడు...హక్కానీ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ హక్కానీ. ఆఫ్గనిస్తాన్‌–పాకిస్థాన్‌ రీజియన్‌లో ప్రముఖ ఉగ్రవాద సంస్థగా హక్కానీ నెట్‌వర్క్‌ను తయారు చేశాడు. ప్రత్యేక క్యాంపుల ద్వారా   వేలాది మందికి శిక్షణ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల బాంబు దాడులు , మానవ హననాలకు పురిగొల్పాడు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న హక్కానీ మృతి చెందినట్లు తాలిబాన్లు ప్రకటించారు.  అయితే,  2015లోనూ జలాలుద్దీన్‌ మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని అప్పట్లో  తాలిబన్లు కొట్టిపారేశారు.

ముజాహిదీన్‌ల తరపున పోరాటం
సోవియట్‌-ఆఫ్గన్‌ యుద్ధం సమయంలో  ముజాహిద్దీన్‌ల తరపును హక్కానీ పోరాటం చేశాడు. అమెరికా(సీఐఏ), గల్ఫ్‌ దేశాలు ముజాహిద్దీన్‌లకు  అవసరమైన ఆర్థిక సహాయ, సహకారాలు అందించాయి. ఈ సమయంలో అమెరికా, పాకిస్తాన్‌ల సహాయంతో సోవియట్‌ ఆక్రమిత ఆఫ్గనిస్థాన్‌ కోసం ముజాహుదీన్‌ల తరఫున  హక్కాని 1979 నుంచి 1989 వరకు  పోరాటం సాగించాడు. ఆ సమయంలోనే తాలిబన్‌ సంస్థలో కీలక నేతగా ఎదిగాడు. అప్పుడు  అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్‌ రీగన్స్‌ హక్కానీని  వైట్‌ హౌస్‌కు ఆహ్వానించాడనే వార్తలు కూడా వచ్చాయి. వైట్‌హౌస్‌ను సందర్శించాడని కూడా మరికొన్ని పత్రికలు రాశాయి.

లాడెన్‌ను తప్పించడం కీలక పాత్ర
సోవియట్‌ ఆఫ్గన్‌ యుద్ధం అనంతరం  ఒసామాబిన్‌ లాడెన్‌ సహా వివిధ దేశాల్లో ఉన్న లాడెన్‌ వంటి తీవ్రవాద సంస్థల నాయకులు, ఆర్థిక సహాయం అందించే సంస్థలతో హక్కాని సన్నిహిత  సంబంధాలను కొనసాగించాడు. 1992లో  కాబూల్‌ను ముజాహిదీన్‌లు ఆక్రమించిన  అనంతరం ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో హక్కానీ  గిరిజన శాఖ మంత్రిగాను బాధ్యతలు నిర్వహించాడు. తాలిబన్ల మిలటరీ కమాండర్‌గాను వ్యవహరించాడు. లాడెన్‌ తప్పించుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. తాలిబన్లను విడిచి రావాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని హక్కానీ తిరస్కరించాడు. తర్వాత కాలంలో అమెరికాకే కొరుకుడు పడని నేతగా తయారయ్యాడు.  పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో తలదాచుకుని  పోరాటం సాగించాడు. హక్కానీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులను తయారు చేశాడు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించాడు.  2009లో న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం హక్కానీ నేతృత్వంలో  4,000–12,000 మంది తీవ్రవాదులు పని చేస్తున్నారు.  2011లో ఆ సంఖ్య 10,000–15,000 మధ్య ఉన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రస్తుతం హక్కానీ కుమారుడు సిరాజుద్దీన్‌ హక్కానీ నెట్‌వర్క్‌కు కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top