breaking news
Soviet
-
కాస్మోస్ 482’ కూలిపోయే సమయం వచ్చేసింది..!
నాటి సోవియట్ యూనియన్ 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ శనివారం భూమ్మీద కూలబోతోంది. వాస్తవానికి ఇది శుక్ర గ్రహాన్ని పరిశోధించేందుకు సోవియట్ 1972లో ప్రయోగించిన ఓ ల్యాండర్ మాడ్యూల్. సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రయోగం విఫలమై గత అర్ధ శతాబ్ద కాలానికి పైబడి ‘కాస్మోస్ 482’ వ్యోమనౌక భూమి దిగువ కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. గుండ్రటి ఆకృతిలో ఉన్న ఈ వ్యోమనౌక బరువు 495 కిలోలు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:46 గంటల సమయంలో అది గంటకు 242 కిలోమీటర్ల వేగంతో భూమిపై కూలుతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) అంచనా వేసింది. భూమిపై 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య గల సువిశాల ప్రదేశంలో అటు బ్రిటన్ మొదలుకొని ఇటు ఆస్ట్రేలియా వరకు అది ఎక్కడైనా కూలిపోవచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, పీడనం పరంగా భూమి వాతావరణంతో పోలిస్తే శుక్ర గ్రహంపై కఠినాతి కఠిన పరిస్థితులు ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శుక్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగేలా ‘కాస్మోస్ 482’ను ప్రత్యేకంగా డిజైన్ చేసి, టైటానియం ఉష్ణరక్షణ కవచంలో ఉంచి ప్రయోగించారు. అందువల్ల భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పటికీ ఇతర అంతరిక్ష నౌకలు, ఖగోళ వస్తువుల మాదిరిగా ‘కాస్మోస్ 482’ గాలి ఒరిపిడికి మండిపోయి శకలాలుగా రాలిపోదని, ‘ఫిరంగి గుండు’ మాదిరిగా ‘ఒకే ముక్క’గా చెక్కు చెదరకుండా భూమిపై కూలుతుందని భావిస్తున్నారు. ఫలితంగా రోదసి నుంచి భూమిపై కూలిపోయే ఇతర వ్యర్థాలతో పోలిస్తే ఈ స్పేస్ క్రాఫ్ట్ పతనం వల్ల తలెత్తే ప్రమాదం తక్కువేనని అంటున్నారు. శుక్రుడిపై దిగే సమయంలో ‘కాస్మోస్ 482’ వేగాన్ని తగ్గించడానికి పారాచూట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే 50 ఏళ్లకు పైగా నౌక అంతరిక్షంలోనే ఉండిపోయినందున సౌర వికిరణం ప్రభావానికి ఆ పారాచూట్ వ్యవస్థ పాడైపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒమన్ సింధుశాఖ, ఈశాన్య ఆఫ్రికా, బోర్నియో, పశ్చిమార్ధ గోళంలోని ప్రదేశాల్లో వ్యోమనౌక కూలవచ్చని, అయితే భూమిపై సముద్ర ప్రాంతాలతో కూడిన జలావరణమే 70% ఉంది కనుక జనావాస ప్రాంతాల్లో అది కూలే అవకాశాలు స్వల్పమని భావిస్తున్నారు. ఇక అది నేరుగా ఒక వ్యక్తిపై పడే సంభావ్యత వేలు, లక్షల వంతుల్లో ఒక శాతం వంతు మాత్రమే. 1961-1984 మధ్య కాలంలో నాటి సోవియట్ తన ‘వెనెరా మిషన్స్’లో భాగంగా శుక్ర గ్రహంపైకి 29 అంతరిక్ష నౌకలను ప్రయోగించగా 10 వ్యోమనౌకలు శుక్రుడిపై విజయవంతంగా దిగాయి. - జమ్ముల శ్రీకాంత్ -
అగ్రరాజ్యం ఆంక్షలకు చెక్‌పెట్టేలా... రష్యా యుద్ధ విన్యాసాలు
మాస్కో: ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధానికి దిగినందుకు అమెరికా రష్యాని ఒంటరి చేసేలా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో ఆగ్రహంతో ఉన్న రష్యా ఆ చర్యలన్ని తిప్పికొట్టే ఎత్తుగడను తెరపైకి తీసుకువచ్చి మరీ అమలు చేస్తోంది. అమెరికా ఎత్తు పారనీయకుండా రష్యా అట్టహాసంగా యుద్ధ విన్యాసాలకు సిద్ధమైంది. అందుకోసం భారత్, చైనాలను రష్యాకు తీసుకువచ్చింది. ఈ మేరకు తూర్పు తీర ప్రాంతాల తోపాటు జపాన్ సముద్ర జలాల్లో గురువారం వోస్టాక్-2022 యుద్ధవిన్యాసాలను ప్రారంభించనుంద. వారం రోజుల పాటు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. ఈ సైనిక కసరత్తుల్లో సుమారు 50 వేలకు పైగా బలగాలు, దాదాపు 140కి పైగా యుద్ధ విమానాలు, 60 యుద్ధనౌకలతో సహా దాదాపు 5 వేల సైనిక సామాగ్రిని వినియోగించనున్నారు. ఈ సాధారణ సైనిక కసరత్తులు రష్యా నేతృత్వంలోని మాజీ సోవియట్ దేశాలకు చెందిన సభ్యదేశాల భాస్వాములను ఒక చోటకు చేరుస్తాయి. ఈ ఆర్మి డ్రిల్‌లో పాల్గొనేందుకు న్యూఢిల్లీ సుమారు 75 మందితో కూడిన చిన్న సైనిక బృందాన్ని పంపుతోంది. ఈ బృందంలో గుర్ఖా దళాలు, నౌకదళం, వైమానికి దళం నుంచి ప్రతినిధులు ఉన్నారు. అయినప్పటికీ భారత్ నావికా లేదా వైమానిక సామాగ్రిని రష్యాకు పంపడం లేదు. భారత్‌కి చైనా, పాకిస్తాన్లతో ఉన్క సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కోసం రష్యా పై ఆధారపడటంతో గతంలో రష్యాలో ఈ సైనిక విన్యాసాలకు హాజరైంది. ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధ విషయంలో రష్యా అనుసరిస్తున్న తీరుతో కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా భారత్ రష్యాతో సంయుక్తంగా ఉత్పత్తి చేసే హెలికాప్టర్ల ఎత్తుగడను సైతం విరమించుకుంది. అలాగే మరో 30 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికను సైతం నిలిపేసింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ విషయమై రష్యాను విమర్శించడానికి ముందుకు రాలేదు చైనా. సుదీర్ఘ యుద్ధ కారణంగా యూఎస్, పశ్చిమ దేశాలు రష్యాపై మరోసారి ఆంక్షల మోత మోగించే అవకాశం ఉన్నందున చైనా రష్యాకు మద్దతు ఇచ్చిన సాంకేతికత, సైనిక సామాగ్రిని అందజేసింది. ఐతే మాస్కో మాత్రం చైనా పాత్రను రష్యాకు మద్దతుగా పరిగణించలేమని రష్యా సైనికుడు వాసిలీ కాషిన్ అన్నారు. దీన్ని తాము మిలటరీ సంబంధాలుగానే కొనాసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వోస్టాక్ 2022 యుద్ధ విన్యాసాల్లో మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, తజకిస్తాన్, సిరియా, అల్జీరియా, మంగోలియా, లావోస్, నికార్గావ్ తోపాటు రష్యా మిత్రదేశమైన బెలారస్ కూడా పాల్గొంటుంది. (చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్) -
ఎవరీ హక్కానీ?
అగ్రరాజ్యం ఆర్థిక అండతో కీలక నేతగా ఎదిగాడు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. ఆక్రమిత ఆఫ్గనిస్తాన్‌ను సాధించడంలో కీలక భూమికి పోషించాడు. లాడెన్‌కు మద్దతిచ్చి అమెరికా ఆగ్రహానికి గురయ్యాడు...హక్కానీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ. ఆఫ్గనిస్తాన్–పాకిస్థాన్ రీజియన్‌లో ప్రముఖ ఉగ్రవాద సంస్థగా హక్కానీ నెట్‌వర్క్‌ను తయారు చేశాడు. ప్రత్యేక క్యాంపుల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల బాంబు దాడులు , మానవ హననాలకు పురిగొల్పాడు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న హక్కానీ మృతి చెందినట్లు తాలిబాన్లు ప్రకటించారు. అయితే, 2015లోనూ జలాలుద్దీన్ మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని అప్పట్లో తాలిబన్లు కొట్టిపారేశారు. ముజాహిదీన్ల తరపున పోరాటం సోవియట్-ఆఫ్గన్ యుద్ధం సమయంలో ముజాహిద్దీన్ల తరపును హక్కానీ పోరాటం చేశాడు. అమెరికా(సీఐఏ), గల్ఫ్ దేశాలు ముజాహిద్దీన్లకు అవసరమైన ఆర్థిక సహాయ, సహకారాలు అందించాయి. ఈ సమయంలో అమెరికా, పాకిస్తాన్ల సహాయంతో సోవియట్ ఆక్రమిత ఆఫ్గనిస్థాన్ కోసం ముజాహుదీన్ల తరఫున హక్కాని 1979 నుంచి 1989 వరకు పోరాటం సాగించాడు. ఆ సమయంలోనే తాలిబన్ సంస్థలో కీలక నేతగా ఎదిగాడు. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్ రీగన్స్ హక్కానీని వైట్ హౌస్‌కు ఆహ్వానించాడనే వార్తలు కూడా వచ్చాయి. వైట్‌హౌస్‌ను సందర్శించాడని కూడా మరికొన్ని పత్రికలు రాశాయి. లాడెన్‌ను తప్పించడం కీలక పాత్ర సోవియట్ ఆఫ్గన్ యుద్ధం అనంతరం ఒసామాబిన్ లాడెన్ సహా వివిధ దేశాల్లో ఉన్న లాడెన్ వంటి తీవ్రవాద సంస్థల నాయకులు, ఆర్థిక సహాయం అందించే సంస్థలతో హక్కాని సన్నిహిత సంబంధాలను కొనసాగించాడు. 1992లో కాబూల్‌ను ముజాహిదీన్లు ఆక్రమించిన అనంతరం ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో హక్కానీ గిరిజన శాఖ మంత్రిగాను బాధ్యతలు నిర్వహించాడు. తాలిబన్ల మిలటరీ కమాండర్గాను వ్యవహరించాడు. లాడెన్ తప్పించుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. తాలిబన్లను విడిచి రావాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని హక్కానీ తిరస్కరించాడు. తర్వాత కాలంలో అమెరికాకే కొరుకుడు పడని నేతగా తయారయ్యాడు. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో తలదాచుకుని పోరాటం సాగించాడు. హక్కానీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులను తయారు చేశాడు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించాడు. 2009లో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం హక్కానీ నేతృత్వంలో 4,000–12,000 మంది తీవ్రవాదులు పని చేస్తున్నారు. 2011లో ఆ సంఖ్య 10,000–15,000 మధ్య ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం హక్కానీ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ నెట్‌వర్క్‌కు కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
వందేళ్ల వసంతం
అదొక మహత్తరమైన మలుపు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన. కార్మికవర్గ విప్లవంతో సమసమాజ స్థాపన జరుగుతుందన్నాడు కార్ల్ మార్క్స్. ఆ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టిన సందర్భమది. ప్రపంచంలో తొలిసారిగా కార్మికులు రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఉదంతం. తొలి సోషలిస్టు దేశం ఆవిర్భవించిన చరిత్ర. అదే అక్టోబర్ విప్లవం! రష్యా విప్లవం! బోల్షివిక్ విప్లవం! యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రష్యా! 1917 లో సంభవించిన ఆ మహా విప్లవానికి ఈ నవంబర్ 7వ తేదీతో వందేళ్లు నిండుతున్నాయి. కానీ ఇప్పుడు సోషలిస్టు రష్యా లేదు. పాతికేళ్ల కిందటే రద్దయింది! 1991లో సోషలిజాన్ని అధికారికంగా రద్దు చేసుకుని రష్యా సమాఖ్యగా మారింది. కానీ సోషలిస్టు రష్యా మనుగడ సాగించిన 75 ఏళ్లలో ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. మరిన్ని దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఆ సమయంలో ప్రపంచం రెండు భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఆ ధృవాల మధ్య వైరం ఎప్పుడు విస్ఫోటనమవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొని ఉండేవి. కానీ.. సోవియట్ రష్యా విచ్ఛిన్నంతో ప్రపంచం ఏకధృవంగా మారిపోయింది. మార్క్స్ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, సోషలిజం సాక్షాత్కారానికి ఆస్కారం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా విపణి సమాజమే అంతిమం అనే వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ.. కార్మికవర్గానికి, సోషలిస్టు వాదులకు అక్టోబర్ విప్లవం ఎప్పటికీ మార్గదర్శిగానే నిలిచిపోయింది. సోవియట్ రష్యా కూలిపోవడానికి కారణం లెనిన్ అనంతర ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లో లోపాలే కానీ.. అంతటితో సోషలిజం అంతం కాలేదని నమ్మేవారూ ప్రపంచ వ్యాప్తంగా బలంగానే ఉన్నారు. సోషలిస్టు రష్యాలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఏటా అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించేవారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామపక్ష శక్తులకు కూడా పండగగానే ఉండేది. ఇప్పుడు అక్టోబర్ వందేళ్ల విప్లవ ఉత్సవాన్ని రష్యాలో అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది అటుంచితే.. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, మేధావులు తమ పునరేకీకరణకు, మరింత లోతైన అధ్యయనానికి ఈ సందర్భాన్ని ఒక వేదికగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విప్లవంపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ రష్యా సోషలిస్టు విప్లవానికి శతాబ్దం పూర్తి ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవం మార్క్స్ ‘కార్మిక విప్లవా’న్ని ఆచరణలో పెట్టిన లెనిన్ - ప్రపంచంలో తొలి కార్మికవర్గ రాజ్యంగా అవతరణం - ఎన్నో దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలకు స్ఫూర్తి ప్రదాత - రెండు భిన్న ధృవాలుగా చీలిపోయిన ప్రపంచ దేశాలు - రష్యా, అమెరికాలు ‘సూపర్ పవర్’లుగా ఆవిర్భావం - ఇరువురి మధ్య అర్ధ శతాబ్దం పాటు ప్రచ్ఛన్న యుద్ధం - పాతికేళ్ల కిందట పతనమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా బ్లడీ సండే: తొలి సోవియట్ ఆవిర్భావం రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం రావడానికి అది విజయవంతం కావడానికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. జార్ రాచరిక నిరంకుశ పాలనలోని రష్యాలో 1905 లోనే ఈ విప్లవానికి పునాదులు పడ్డాయి. పట్టణాల్లోని కార్మికవర్గం అవధులు లేని పనిగంటలతో సతమతమవుతుండేది. పెట్రోగ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్.. అప్పటి రష్యా రాజధాని)లో జనవరి 22వ తేదీన (ఆదివారం) కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చక్రవర్తి (జార్) నికొలస్-2కు వినతిపత్రం ఇవ్వడం కోసం నిరాయుధంగా, శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్నపుడు సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 1000 నుంచి 4000 మంది వరకూ చనిపోవడం, గాయపడటం జరిగిందని భిన్న అంచనాలు ఉన్నాయి. ‘బ్లడీ సండే’గా పేర్కొనే ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా కార్మికవర్గ నిరసనలు, సమ్మెలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తొలి సోవియట్ (సహకార మండలి)ని స్థాపించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ సోవియట్లు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు రాజకీయ నిరసన అప్పుడే మొదలైంది. రెడ్ అక్టోబర్... ఫిబ్రవరి విప్లవం విజయవంతం కావడంతో అప్పటివరకూ స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న అతివాద బోల్షివిక్ నాయకుడు లెనిన్ తదితరులు ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. పెట్రోగార్డ్ సోవియట్‌లో బోల్షివిక్ల కన్నా మితవాద మెన్షెవిక్‌లు, సోషలిస్టు విప్లవవాదులు బలంగా ఉండేవారు. అయితే.. తాత్కాలిక ప్రభుత్వంలో డ్యూమాకు సోవియట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ నాటికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు సోషలిస్టు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని లెనిన్ గుర్తించాడు. లెనిన్ రాకతో అంతకంతకూ పుంజుకుంటూ వచ్చిన బోల్షివిక్‌లు విప్లవం లేవదీశారు. అప్పటికే పెట్రోగార్డ్ సోవియట్‌కు అనుబంధంగా నిర్మించిన రెడ్ గార్డ్స్ సాయంతో అక్టోబర్ 25వ తేదీన (కొత్త క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7) ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సోవియట్ల చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం మొదలైంది. ఈ విప్లవంలో ఏ వైపూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే ఇది రక్తపాత రహిత విప్లవంగా చరిత్రలో నమోదయింది. లెనిన్ సారథ్యంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ప్రపంచ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. అంతర్యుద్ధం..: కానీ.. విప్లవం అంతటితో పూర్తవలేదు. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్యుద్ధం రాజుకుంది. సోవియట్లను, సోషలిస్టు వ్యవస్థను వ్యతిరేకించే వర్గాలు, జార్ రాచరిక అనుకూల వర్గాలతో పాటు.. అతివాద బోల్షివిక్లను వ్యతిరేకించే సోషలిస్టు రివల్యూషనరీలు ఒకవైపు.. బోల్ష్విక్లు మరొకవైపుగా అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోసం రెండు పక్షాల వారూ కార్మికులు, రైతులను బలవంతంగా సైన్యంలో చేర్చేవారు. 1918లో జార్ కుటుంబాన్ని బోల్షివిక్‌లు చంపేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వైదొలగినా.. అమెరికాతో కూడిన మిత్రరాజ్యాలు అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవటంతో సోవియట్ల రెడ్ ఆర్మీ వారితోనూ పోరాడింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ అంతర్యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. చివరికి రెడ్ గెలిచిన తర్వాత 1922 డిసెంబర్ 29న సోవియట్ రష్యా ఆవిర్భవించింది. విప్లవ కెరటాలు రష్యా విప్లవం స్ఫూర్తితో అదే సమయంలో జర్మనీలో, హంగరీ, ఇటలీ, ఫిన్లాండ్, వంటి పలు దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు తలెత్తాయి. కానీ.. పెద్దగా విజయాలు సాధించలేదు. కొన్నిచోట్ల విజయవంతమైనా కూడా ఎంతో కాలం నిలువలేదు. అయితే అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. అందులో రష్యా కమ్యూనిస్టు పార్టీ పాత్ర, సాయం కూడా ఉంది. అనంతర కాలంలోనూ చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. భారత్ సహా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథా ఎంచుకోవడానికి రష్యా, చైనా విప్లవాలు మార్గదర్శిగా నిలిచాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విప్లవ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సోషలిజం నిర్మాణ ప్రయత్నాలు... సోషలిస్టు రష్యాలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. కార్మికులకు 8 గంటల పనిదినం, రైతులకు భూముల పంపిణీ, బ్యాంకులు, పరిశ్రమల జాతీయీకరణ వంటి కార్మికవర్గ అనుకూల సంస్కరణలు జరిగాయి. సామూహిక వ్యవసాయం అమలు చేశారు. అందరికీ విద్యా హక్కు కల్పించారు. పారిశ్రామికీకరణ వేగవంతమైంది. అందరికీ పని అందించేందుకు కృషి చేశారు. దేశంలో పితృస్వామ్యం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి జరిగింది. మహిళలకు, జాతిపరంగా మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారు. వ్యవస్థీకృత మతాన్ని వ్యతిరేకించారు. ఇంట్లో మినహా అన్నిచోట్లా మత బోధనను నిషేధించారు. హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించారు. విద్యను చర్చి నుంచి వేరుచేశారు. హేతువాదంతో కూడిన విద్యను అమలు చేశారు. అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పంచవర్ష ప్రణాళికలతో సోవియట్ రష్యా అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలకు డ్యాములు, పరిశ్రమల నిర్మాణం, ఆయుధాల సరఫరా వంటి వాటితో సహా ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో సాయం అందించింది. ప్రచ్ఛన్న యుద్ధం... మరోవైపు.. అదే సమయంలో అధికార కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత పోరూ మొదలైంది. 1924లో లెనిన్ చనిపోయాక స్టాలిన్ అధికారం చేపట్టాడు. స్టాలిన్ విధానాలను వ్యతిరేకించిన రెడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ట్రాట్స్కీ దేశబహిష్కరణకు గురయ్యాడు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో హిట్లర్ సారథ్యంలోని నాజీ జర్మనీని రష్యా ఓడించింది. ప్రపంచ చరిత్రలో అది మరింత కీలకమైన మలుపు. కానీ యుద్ధంలో 2.6 కోట్ల మంది రష్యా ప్రజలు చనిపోయారు. అయితే.. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, అమెరికా ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవి కావడంతో వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్ మధ్య ఆధిపత్యం అంశంపై విభేదాలు తీవ్రమయ్యాయి. అణ్వాయుధాల తయారీ సహా రెండు దేశాల మధ్యా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. రష్యా, అమెరికాలు రెండూ ‘సూపర్ పవర్‘లుగా నిలిచాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వెనుకా రెండు ధృవాలుగా విడిపోయింది. వాటి మధ్య ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నంత ఉత్కంఠగా పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి విప్లవం... ఇక మొదటి ప్రపంచ యుద్ధం కూడా రష్యా ప్రజల్లో జార్‌పై, ఆయన పరిపాలనపై వ్యతిరేకతను పెంచింది. జార్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే లక్ష్యంతో రైతాంగాన్ని యుద్ధరంగంలోకి పంపించాడు. కానీ.. తన కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ చేతిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది యుద్ధరంగంలో నేలకూలుతున్నారు. మరోవైపు.. యుద్ధం కోసం భారీగా కరెన్సీ నోట్లు ముద్రించటంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1917 వచ్చేసరికి ధరలు నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పట్టణాల్లో పరిశ్రమలు సగానికి సగం మూతపడ్డాయి. నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. కార్మికులకు రొట్టెలు దొరకటం గగనమైపోయింది. ఇంకోవైపు ఉన్న పరిశ్రమల్లో కార్మికులు పన్నెండు గంటలకు పైగా వెట్టిచాకిరి చేయాల్సిన దుస్థితి. అందులో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను సరళం చేయాలన్న డ్యూమా (పార్లమెంటు)ను జార్ రద్దు చేశాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని, శాంతి కావాలని, రొట్టెలు కావాలనే డిమాండ్లతో పెట్రోగార్డ్లో కార్మికులు సమ్మెకు దిగారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రవాసంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఈ సమ్మెలకు, ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేయాలని జార్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అప్పటికే యుద్ధంలో దెబ్బతిని ఉన్న సైన్యంలో అధిక భాగం కార్మికులకు మద్దతుగా నిలిచారు. చాలా మంది పారిపోయారు. ఇక గత్యంతరం లేక 1917 మార్చి 2న (కొత్త క్యాలెండర్ ప్రకారం మార్చి 15న) జార్ నికొలస్-2 చక్రవర్తి పీఠాన్ని త్యజించాడు. ఆయన సోదరుడు ఆ పీఠం స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో రాచరిక డ్యూమా, పెట్రోగార్డ్ సోవియట్ కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం ఈ సర్కారు ముఖ్య లక్ష్యం. సోవియట్ పతనం... 1953లో స్టాలిన్ మరణంతో రష్యాలో అధికారం కోసం అంతర్గత పోరాటం మొదలైంది. కృశ్చేవ్ అధికారం చేపట్టి తన పట్టు బిగించాడు. ఆయన విఫలమయ్యాడంటూ కమ్యూనిస్టు పార్టీ స్వయంగా 1964లో తొలగించింది. ఆ తర్వాత బెద్నేవ్, కోసిజిన్, పోద్గోర్నీలు ఉమ్మడిగా నాయకత్వం వహించారు. అనంతరం బ్రెజ్నేవ్ నాయకత్వం చేపట్టాడు. కృశ్చేవ్, బ్రెజ్నేవ్ల హయాంలో రష్యా పారిశ్రామిక, అంతరిక్ష రంగాల్లో శిఖరస్థాయికి చేరుకుంది. కానీ.. ఆ సమయంలో వేగంగా సాగుతున్న ఆధునికీకరణ, కంప్యూటరీకరణల్లో రష్యా అంతకంతకూ వెనుకబడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చమురు ధరలు ఎగుడుదిగుళ్లు కావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆండ్రపోవ్, చెరెన్కోల తర్వాత అధికారం చేపట్టిన గోర్బచేవ్.. రష్యా కమ్యూనిస్టు పార్టీని ఆధునీకరించే పని మొదలుపెట్టాడు. అధికారంలో పార్టీ పట్టును సడలించాడు. సామాజిక సమస్యలపై ప్రజలు దృష్టి సారించడం పెరిగింది. ఈ క్రమంలో గోర్బచేవ్, పార్టీ నాయకుడు ఎల్సిన్ల మధ్య అధికార పోరు తీవ్రమైంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ రద్దయింది. రష్యా ఫెడరేషన్ అవతరించింది. రష్యా సూపర్ పవర్ హోదా కోల్పోయింది. కమ్యూనిజం భవిష్యత్? సోవియట్ రష్యా పతనం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదులను ఎంతో నిస్పృహకు లోను చేసింది. ఇక మార్క్సిజం, కమ్యూనిజాలు విఫలమయ్యాయన్న వాదనలు వ్యతిరేక వర్గం నుంచి వెల్లువెత్తాయి. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ప్రపంచానికి అంతిమ పరిష్కారమన్న సూత్రీకరణలు జరిగాయి. అయితే వామపక్ష వాదులు అది కేవలం విప్లవానికి ఒక ఎదురు దెబ్బేనని, సోషలిస్టు స్థాపనకు నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నారు. నవంబర్‌లో అక్టోబర్ విప్లవం..! రష్యా సోషలిస్టు విప్లవానికి అక్టోబర్ విప్లవం అని పేరు. కానీ.. ఆ విప్లవం సంభవించింది ప్రస్తుత కేలండర్లో నవంబర్ 7వ తేదీ. విప్లవం వచ్చే సమయానికి రష్యాలో జూలియన్ కేలండర్ ఉపయోగించేవారు. ఆ కేలండర్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన ఈ విప్లవం సంభవించింది. ఆ తర్వాతి నుంచి ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ కేలండర్లో అది నవంబర్ 7వ తేదీ అయింది. అందుకే అక్టోబర్ విప్లవం ఉత్సవాన్ని నవంబర్‌లో నిర్వహించుకుంటారు. -
బక్ క్షిపణుల సామర్థ్యమిదీ...
ఉక్రెయిన్ గగనతలంపై దాదాపు 10 కి.మీ. ఎత్తులో ఎగురుతున్న మలేసియా విమానాన్ని ‘బక్’ రకం క్షిపణి కుప్పకూల్చడంతో దీని సామర్థ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని పనితీరును పరిశీలిస్తే...అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నాటి సోవియెట్ రష్యా ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల మధ్యశ్రేణి బక్ రకం క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది.సైనిక విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులను కూల్చేందుకు వీటిని వాడతారు. ఈ క్షిపణులు 72 వేల అడుగుల ఎత్తులోని లక్ష్యాలను సైతం ఛేదించగలవు. (క్షిపణి ఢీకొట్టే సమయానికి మలేసియా విమానం 33 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది)ఒక్కో బక్ వ్యవస్థలో నాలుగు క్షిపణలు, రాడార్ వాహనం, లాంచ్ వాహనం, కమాండ్ కాంప్లెక్స్ ఉంటాయి. ఈ క్షిపణి రాడార్ సాయంతో నిర్దేశిత లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఒక్కసారి క్షిపణిని ప్రయోగించాక అది 30 కి.మీ ఎత్తు వరకూ ఎగరగలుగుతుంది. ఒక్కో క్షిపణి అంచున 70 కిలోల పేలుడు పదార్థాలు ఉంటాయి. లక్ష్యాన్ని సమీపించగానే తొలుత క్షిపణి అంచు పేలిపోతుంది. అనంతరం మిగిలిన క్షిపణి భాగం పదునైన ఇనుప ముక్కలను లక్ష్యంపై చిమ్ముతుంది.{పస్తుతం ఉక్రెయిన్తోపాటు రష్యా దళాలు అత్యాధునిక ఎస్ఏ-17 రకం బక్ వ్యవస్థను వినియోగిస్తున్నాయి.