మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి

US Moves Draft Resolution in UNSC to Blacklist JeM Chief Masood Azhar - Sakshi

నేరుగా ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టిన అమెరికా

ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని పేర్కొంటూ నేరుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్‌లు మద్దతు తెలిపాయి. చాలా శక్తిమంతమైన భద్రతామండలిలో నేరుగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మసూద్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా, అతడు ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా కోరింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ స్పందించారు. ‘బలవంతంగా తీర్మానాన్ని ముందుకు జరపడం ఆపాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నాం’ అని అన్నారు.

ఈ తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్‌ జరుగుతుందనే విషయంపై స్పష్టతలేదని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. 15 మంది (10+5) సభ్యులున్న భద్రతామండలిలో తీర్మానం పాస్‌ కావాలంటే తొమ్మిది ఓట్లు కావాలి. అయితే శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు అడ్డుకుంటూ ఒక్క వీటో కూడా వేయొద్దు. అప్పుడే ఆ తీర్మానానికి ఆమోద ముద్ర పడుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే చైనా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని అడ్డుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా, ప్రణాళికలు రచించడంలో, ఆయుధాల సరఫరా చేయడంలో మసూద్‌ సహాయం అందిస్తున్నాడని, జైషేమహ్మద్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాడని తీర్మానంలో అమెరికా పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top