హెచ్‌1బీ వీసాదారులకు ఊరట

US allows 60-day grace time for H1B visa holders - Sakshi

నోటీసులపై స్పందనకు అదనంగా 60 రోజుల గడువు

ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికాలో భారత్‌ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులకు భారీ ఊరట లభించింది. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న హెచ్‌1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు స్పందించడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ట్రంప్‌ సర్కార్‌ మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ అనుమతులు మంజూరు చేసింది. హెచ్‌1బీ, గ్రీన్‌కార్డులకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు స్పందించడానికి గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌)  వెల్లడించింది.

వీసా పొడిగింపు విజ్ఞప్తులు (ఎన్‌–14), తిరస్కరణ నోటీసులు, ఉపసంహరణ నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడుల ఉపసంహరణ, ముగింపు నోటీసులు, ఫారమ్‌ ఐ–290బీ సమర్పణలు, దరఖాస్తు నోటీసులు వంటి వాటిపై అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి గడువు పెంచింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులపై ఉన్న గడువు తేదీ తర్వాత మరో రెండు నెలలపాటు వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఫారమ్‌ ఐ–290బీ నింపి పంపించడానికి ఈ ప్రకటన విడుదలైన నుంచి 60 రోజుల వరకు గడువు ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటుకు వీలు కల్పించే గ్రీన్‌ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top