భారత్‌ వంటి దేశాలకు సెల్యూట్‌: యూఎన్‌ చీఫ్‌

UN Chief Salutes Countries Like India Helping Others In Covid 19 Fight - Sakshi

న్యూయార్క్‌: మహమ్మారి కోవిడ్‌-19పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న దేశాలకు సెల్యూట్‌ చేస్తున్నామని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తి కట్టడికై భారత్‌ వంటి దేశాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. కరోనా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడంలో సత్పలితాలు ఇస్తున్నట్లుగా భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను దాదాపు 55 దేశాలకు భారత్‌ ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న దేశీయ అవసరాల కోసం తొలుత ఈ మందుల సరఫరాపై నిషేధం విధించిన భారత్‌ మానవతా దృక్పథంతో ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో అమెరికా, మాల్దీవులు, ఇజ్రాయెల్‌, మారిషస్‌, సేచెల్లీస్‌ తదితర దేశాలు ఇప్పటికే హైడ్రాక్సీక్లోరో​క్విన్‌ను దిగుమతి చేసుకున్నాయి.(భారత్‌ అంగీకరించింది: మలేషియా)

ఇక పొరుగు దేశాలైన అఫ్గనిస్తాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేషియా, శ్రీలంక, మయన్మార్‌కు మందులు ఎగుమతి చేసేందుకు భారత్‌ అంగీకరించింది. అదే విధంగా జాంబియా, డొమినికన్‌ రిపబ్లిక్‌, మడగాస్కర్‌, ఉగాండా, బర్కినా ఫాసో, నైగెర్‌, మాలి, కాంగో, ఈజిప్టు, అర్మేనియా, కజక్షాన్‌, ఈక్వెడార్‌, జామాపియా, సిరియా, ఉక్రెయిన్‌, చాద్‌, జింబాబ్వే, ఫ్రాన్స్‌, కెన్యా, జోర్డాన్‌, నెదర్లాండ్స్‌, నైజీరయా, ఒమన్‌, పెరు మొదలగు దేశాలకు కూడా విపత్కర పరిస్థితుల్లో భారత్‌ సాయం అందించనుంది. కాగా కరోనాపై పోరులో ప్రపంచదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఐరాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (యూకే నిపుణుల కమిటీ చైర్మన్‌గా వెంకీ రామకృష్ణన్‌)

ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘వైరస్‌ను అంతం చేసేందుకు చేస్తున్న పోరాటంలో సంఘీభావంతో మెలగాలని ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉన్న దేశాలు సాయం అర్థించే దేశాలకు తప్పక సహాయం చేయాలని ఆయన ఉద్దేశం. ఇందుకు స్పందించి ఇతరులకు అండగా నిలుస్తున్న దేశాలకు మేము సెల్యూట్‌ చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. భారత్‌ చేస్తున్న సాయంపై స్పందించాల్సిగా విలేకరులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా బదులిచ్చారు. (కరోనా: సంక్షోభంలో వారి భవిష్యత్తు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top