కోట్లాది చిన్నారులపై కోవిడ్‌ ప్రభావం: ఐరాస

Coronavirus: United Nations Issues Call to Protect Children - Sakshi

ఐక్యరాజ్యసమితి: కోవిడ్‌–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పసివారిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇటీవలి కాలంలో శిశు మరణాల సంఖ్యను తగ్గించుకోగలిగినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం కారణంగా కొన్ని లక్షల మంది అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి వెళతారనీ, ఫలితంగా శిశుమరణాలు వేలాదిగా పెరిగే ప్రమాదముందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. 2019 అంచనాల ప్రకారం 386 మిలియన్ల మంది చిన్నారులు దుర్భర దారిద్య్రంలో ఉండగా, ఈ ఏడాది తలెత్తిన సంక్షోభం కారణంగా మరో 42 నుంచి 66 మిలియన్ల మంది పసివారు పేదరికంలో మగ్గిపోతారని అంచనా వేసింది.

‘పాలసీ బ్రీఫ్‌; ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ కోవిడ్‌–19 ఆన్‌ చిల్డ్రన్‌’ పేరుతో ఒక పత్రాన్ని ఐరాస విడుదల చేసింది. కోవిడ్‌ మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, వారి భవిష్యత్తు సంక్షోభంలో పడనుందని అందులో పేర్కొంది. అవి 1) చిన్న పిల్లలకు వైరస్‌ సోకడం, 2) వైరస్‌ కలిగించే తక్షణ సామాజిక ఆర్థిక ప్రభావం 3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుపై కోవిడ్‌ –19 దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని వెల్లడించింది. పాఠశాలల మూసివేత కారణంగా 188 దేశాల్లో 1.5 బిలియన్ల మంది పిల్లల విద్యాబోధన పూర్తిగా కుంటుపడింది. మూడింట రెండొంతుల దేశాలు దూరవిద్యావిధానాన్ని అమలుచేయగా, అందులో తక్కువ ఆదాయం కలిగిన దేశాల వాటా కేవలం 30 శాతమే.

143 దేశాల్లోని 368.5 మిలియన్ల మంది పిల్లలు పౌష్టికాహారం కోసం పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారు. బడులు మూతపడటంతో ఇప్పుడు వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీని ప్రభావంతో 143 దేశాల్లో 368.5 మిలియన్ల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడతారని ఐరాస అంచనా వేసింది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, వారి సంక్షేమం సైతం ప్రమాదంలో పడనుందని పేర్కొంది. ఈ తీవ్రత నుంచి చిన్నారులను రక్షించడానికి ప్రభుత్వాలు చొరచూపాలనీ, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక, ఆహార భద్రత కల్పించాలని ఐరాస ప్రదాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ కోరారు. మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహార కార్యక్రమాలు, పాఠశాల విద్యకు హాని జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

ఇది చదవండి: చైనాపై పెరిగిన అనుమానాలు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top