ఫిలిప్పీన్స్‌లో భారీ టైఫూన్‌

Typhoon Mangkhut Hits South China After Lashing Philippines - Sakshi

‘మంగ్‌ఖుట్‌’తో 64 మంది మృతి

దక్షిణ చైనాపైనా టైఫూన్‌ ప్రభావం

24.5 లక్షల చైనీయులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

హాంకాంగ్‌/బీజింగ్‌ /న్యూబెర్న్‌: శక్తిమంతమైన టైఫూన్‌ మంగ్‌ఖుట్‌ ఫిలిప్పీన్స్‌లో పెను విధ్వంసం సృష్టించింది. మంగ్‌ఖుట్‌ ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో 64 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఈ టైఫూన్‌ క్రమంగా చైనా, హాంకాంగ్‌లపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో చైనాలోని గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్షీ, హైనన్, గ్వెజో ప్రావిన్సులతో పాటు హాంకాంగ్‌లో గంటకు 162 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు కుంభవృష్టి కురుస్తోంది.

ఈ టైఫూన్‌ కారణంగా చైనాలో ఇప్పటివరకూ ఇద్దరు చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. దీంతో చైనా వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సుపై ఈ టైఫూన్‌ తీవ్ర ప్రభావం చూపొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 24.5 లక్షల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేటకు వెళ్లిన 48,000 పడవలను వెనక్కు రప్పించారు. హైనన్‌ ప్రావిన్సులో 632 పర్యాటక ప్రాంతాలను, తీరప్రాంత రెస్టారెంట్లను మూసివేసిన అధికారులు, రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 400 సర్వీసులను రద్దుచేశారు.  

సూపర్‌మార్కెట్లకు పోటెత్తిన ప్రజలు..
మంగ్‌ఖుట్‌ టైఫూన్‌ విధ్వంసం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న భయంతో ప్రజలు సూపర్‌మార్కెట్ల నుంచి భారీగా ఆహారపదార్థాలను కొనుగోలు చేశారు. దీంతో షాపుల ముందు భారీ క్యూలు దర్శనమిచ్చాయి. చైనాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మకావూలో 20,000 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

అమెరికాలో 13కు చేరుకున్న మృతులు..
ఫ్లోరెన్స్‌ హరికేన్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ప్రస్తుతం దీని తీవ్రత ‘ఉష్ణ మండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కరోలినాలో కుంభవృష్టి కొనసాగుతోందనీ, కొన్ని ప్రాంతాల్లో 90 సెం.మీ మేర వర్షం కురిసిందని వెల్లడించారు. 


అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఎంగిల్‌హార్డ్‌ పట్టణాన్ని ముంచెత్తిన హరికేన్‌ ఫ్లోరెన్స్‌ వరద నీరు 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top