కశ్మీర్‌ అంశం: పాక్‌పై తాలిబన్ల ఫైర్‌! | Taliban Slams Pakistan Says Dont Compare Kashmir With Afghanistan: | Sakshi
Sakshi News home page

చేదు అనుభవాలు చవిచూశాం: తాలిబన్లు

Aug 9 2019 11:55 AM | Updated on Aug 10 2019 10:05 AM

Taliban Slams Pakistan Says Dont Compare Kashmir With Afghanistan: - Sakshi

కాబూల్‌ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయమై పాకిస్తాన్‌ పార్లమెంటులో ప్రతిపక్ష నేత షెబాజ్‌ షరీఫ్‌ తెచ్చిన పోలికపై తాలిబన్లు మండిపడ్డారు. కశ్మీర్‌ అంశంతో ఆఫ్గనిస్తాన్‌ను పోల్చడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. కశ్మీర్‌ అంశంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాలపై షెబాజ్‌ మాట్లాడుతూ...‘ కాబూల్‌లో ఆఫ్గన్లు శాంతి సౌఖ్యాలతో హాయిగా జీవిస్తున్నారు. కానీ కశ్మీర్‌లో రక్తం ఏరులై పారుతోంది. ఇది ఎంతమాత్రం ఆమోదించదగిన విషయం కాదు’ అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు స్పందనగా తాలిబన్‌ సంస్థ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆఫ్గనిస్తాన్‌ ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్‌ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను భారత్‌ రద్దు చేసినట్లు వార్తలు ప్రచురితం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ బలగాల మోహరింపుతో అక్కడ ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, కశ్మీర్‌లో నివసించే ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. భారత​-పాకిస్తాన్‌ సంయమనం పాటించి హింస చెలరేగకుండా చూసుకోవాలి. కశ్మీరీల హక్కులకు భంగం కలగకుండా చూడాలి. 

యుద్ధం వల్ల కలిగే చేదు అనుభవాలను చవిచూశాం. కాబట్టి శాంతియుతంగానే సమస్యలను పరిష్కరించుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నాం. ఇస్లామిక్‌ సహకార సంస్థ, ఇస్లామిక్‌ దేశాలు, ఐక్యరాజ్యసమితి సహా ఇతర ప్రధాన దేశాలన్నీ కశ్మీరీల అభద్రతా భావాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషించాలి. మీ ప్రభావంతో ఇరు దేశాలను ఒప్పించి సంక్షోభాన్ని అరికట్టాలి. ఇక కొంతమంది కశ్మీర్‌ అంశాన్ని ఆఫ్గనిస్తాన్‌తో పోల్చడం సరికాదు. అసలు అఫ్గనిస్తాన్‌ పేరును ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి? ఇతర దేశాల మధ్య పోటీకి వేదిక అయ్యేందుకు ఆఫ్గాన్‌ సిద్ధంగా లేదు. ఆఫ్గనిస్తాన్‌ను ఈ విషయంలోకి తీసుకురాకండి’ అని ముజాహిద్‌ లేఖలో పేర్కొన్నాడు. కాగా పార్లమెంటులో ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై కాబూల్‌లో ఉన్న పాక్‌ రాయబారి వివరణ ఇచ్చారు. ‘ కశ్మీర్‌ కారణంగా అఫ్గానిస్తాన్‌లో హింస చెలరేగే అవకాశమే లేదు. ఈ సమస్య వల్ల దేశంలో శాంతికి ఎంతమాత్రం భంగం కలగబోదు. అయితే ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ‍ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement