పాక్‌లో ఉగ్ర బీభత్సం

Suicide bombers attack Chinese consulate in Pakistan's Karachi  - Sakshi

కరాచీలోని చైనా కాన్సులేట్‌పై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన బీఎల్‌ఏ

ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

కరాచీ/బీజింగ్‌/న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలోని చైనా కాన్సులేట్‌పై శుక్రవారం దాడికి దిగిన సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులను అక్కడి భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు.. మొత్తం నలుగురు మరణించగా చైనాకు చెందిన కాపలాదారుడు గాయపడ్డారు. కాన్సులేట్‌ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి పెను విధ్వంసం సృష్టించడమే ఆ ఉగ్రవాదుల లక్ష్యమని తెలుస్తోంది.

చనిపోయిన ఉగ్రవాదుల వద్ద ఆయుధాలతోపాటు ఆహార పదార్థాలు, ఔషధాలు ఉండటంతో చైనీయులను బందీలుగా చేసుకోవడం వారి ప్రణాళికలో భాగమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దాడి తమ పనేనని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. చైనా–పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌ (సీపీఈసీ)కు, బలూచిస్తాన్‌లో చైనా సైనిక కార్యకలాపాల విస్తరణకు తాము వ్యతిరేకమని బీఎల్‌ఏ గతంలో పేర్కొంది. దాడి నేపథ్యంలో పాక్‌లో సీపీఈసీ కోసం పనిచేస్తున్న వేలాది మంది చైనీయులకు రక్షణ పెంచాలని పాక్‌ను చైనా కోరింది. గేటు బయటే భద్రతా దళాలు ముగ్గురు ముష్కరులను అంతమొందించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ చెప్పారు.

గ్రెనేడ్లు, ఏకే–47 తుపాకులతో..
కరాచీలోని ఖరీదైన, ప్రముఖ ప్రాంతం క్లిఫ్టన్‌ ఏరియాలో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రముఖులు కూడా నివాసం ఉంటారు. వివిధ దేశాల కాన్సులేట్లు/రాయబార కార్యాలయాలతోపాటు కరాచీలో పేరుగాంచిన పాఠశాలలు, రెస్టారెంట్లు ఇక్కడే ఉంటాయి. మొత్తం 9 హ్యాండ్‌ గ్రనేడ్లు, ఏకే–47 తుపాకులు, భారీ సంఖ్యలో బుల్లెట్లు, తుపాకీ మేగజీన్‌లు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు ఓ వాహనంలో చైనా కాన్సులేట్‌ వద్దకు చేరుకున్నారు.

అనంతరం వాహనం నుంచి దిగి, కాన్సులేట్‌ బయట ఉన్న సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌పైకి గ్రెనేడ్‌ విసిరారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఇద్దరు పోలీసులతోపాటు అక్కడ ఉన్న ఓ బాలుడు, అతని తండ్రి కూడా ఈ కాల్పుల్లో చనిపోయారు. అనంతరం కాన్సులేట్‌ గేటు వైపుకు ఉగ్రవాదులు వస్తుండగా కార్యాలయం వద్ద ఉన్న ప్రజలు, సిబ్బందిని వెంటనే భద్రతా దళాలు లోపలకు పంపించి తలుపులు మూశాయి.

తర్వాత పారామిలిటరీ దళాలు ఉగ్రవాదాలపై కాల్పులు ప్రారంభించి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం మృతదేహాల వద్ద తనిఖీలు చేయగా భారీ సంఖ్యలో ఆయుధాలు, ఆహార పదార్థాలు, ఔషధాలు లభించాయి. చనిపోయిన ఉగ్రవాదులు తమ వారేనని బీఎల్‌ఏ ఓ ట్వీట్‌ ద్వారా తెలిపింది. ఈ దాడిని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఖండించారు. ‘చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. తమ ప్రాణాలను అర్పించి ఉగ్రవాదుల విజయాన్ని అడ్డుకున్న భద్రతా సిబ్బంది ధైర్యానికి నా సెల్యూట్‌’ అని ఖాన్‌ ట్వీట్‌ చేశారు.

మార్కెట్‌లో ఆత్మాహుతి దాడి... 32 మంది మృతి
పెషావర్‌: పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్క్వా ప్రావిన్సులో ఉగ్రవాదులు శుక్రవారం రెచ్చిపోయారు. ఒరక్‌జై గిరిజన జిల్లాలో షియాల పవిత్రస్థలమైన ఇమామ్‌బర్ఘా వద్ద రద్దీగా ఉన్న జుమ్మా మార్కెట్‌ లక్ష్యంగా ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సిక్కు వ్యాపారస్తులు సహా 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నిదుస్తులు కొనేందుకు ప్రజలు శుక్రవారం భారీగా మార్కెట్‌కు చేరుకున్నవేళ ఈ దాడి చోటుచేసుకుంది.

ఈ విషయమై జిల్లా డీసీపీ ఖలీద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ..‘మార్కెట్‌లో కూరగాయలున్న ఓ బైక్‌కు బాంబును అమర్చిన ఉగ్రవాది రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో వాహనాన్ని పేల్చివేశాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిక్కు వ్యాపారులు సహా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది షియాలే ఉన్నారు’ అని తెలిపారు. ఉగ్రవాదుల్ని అణచివేస్తామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పునరుద్ఘాటించారు.

దాడిని ఎదిరించిన ధీర వనిత సుహాయ్‌
సింధ్‌ ప్రావిన్సుకు చెందిన ఆ అధికారిణి పూర్తి పేరు సుహాయ్‌ అజీజ్‌ తాల్పూర్‌. నాణ్యమైన విద్య కోసం ఆమెను చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే సంప్రదాయాలను ధిక్కరిస్తున్నారంటూ వారి బంధువులు ఆమె కుటుంబంతో మాట్లాడటం మానేశారు. ఈ వెలివేతతో ఆమె కుటుంబం వేరే ఊరికి వలసవెళ్లింది. బీకాం పూర్తి చేసిన ఆమె 2013లో పాక్‌ సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ ఉద్యోగ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి పోలీసు శాఖలో ఉన్నతాధికారిణిగా ఉద్యోగం పొందింది. కాన్సులేట్‌పై దాడిని అడ్డుకున్న భద్రతా దళాల బృందానికి ఆమె నాయకత్వం వహించింది. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టి ధీర వనితగా నిలిచింది.  

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top