దటీజ్...దటూక్...!
కొన్ని రోజులుగా మలేసియా రాజధాని కౌలాలంపూర్ రోడ్లపై ఒక విచిత్రమైన కారు షికార్ చేస్తోంది.
కొన్ని రోజులుగా మలేసియా రాజధాని కౌలాలంపూర్ రోడ్లపై ఒక విచిత్రమైన కారు షికార్ చేస్తోంది. ఆ కారును చూసిన వాళ్లందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అంతలా అందరినీ అబ్బురపరుస్తున్న ఆ కారు ప్రత్యేకత ఏంటంటే... ఆ కారుపై వేలకొద్దీ బొమ్మ కార్లు అంటించి ఉన్నాయి. మొదట్లో దాన్ని గమనించిన ప్రజలు అది ఏదో మార్కెటింగ్ స్టంట్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత విషయం తెలుసుకున్న వారు ఇదెక్కడి పిచ్చిరా బాబు అని చెవులు కొరుకుంటున్నారు.
హరియన్ మెట్రో వారు ఆ కారు, ఆ కారుపై ఉన్న బొమ్మ కార్లు దానివెనుకున్న రహస్యాన్ని ఛేదించారు. జాగ్వార్ కంపెనీకి చెందిన ఆ కారు యజ మాని ఒక వ్యాపారవేత్త. అతని పేరు దటూక్ సేరి మహదీ బద్రుల్ జమాన్. అతనికి కార్లంటే పిచ్చి ఎక్కువ. ఆ మక్కువతోనే తన 13 ఏట నుంచి బొమ్మ కార్లను సేకరించేవాడు. అలా ఇప్పటికి 5 వేల కార్లను సేకరించాడు. తన జాగ్వార్ అందరి కార్ల కంటే కొంచెం విభిన్నంగా ఉండాలని భావించిన మహదీ తాను సేకరించిన 4,600 బొమ్మ కార్లను అంటించి మురిసిపోయాడు.


