ఆసియా బీబీ పాక్‌ విడిచి వెళ్లిపోయింది!

Reports On Asia Bibi Reveals She Left Pakistan Who Cleared Of Blasphemy - Sakshi

ఇస్లామాబాద్‌ : దైవ దూషణ చేసిందన్న ఆరోపణలతో అరెస్టై..మరణ శిక్ష నుంచి బయటపడ్డ క్రిస్టియన్‌ మహిళ ఆసియా బీబీ పాకిస్తాన్‌ విడిచి వెళ్లిపోయినట్లు ఆమె లాయర్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఆసియా బీబీ కెనడాకు వెళ్లినట్లు తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆసియా బీబీ మరణశిక్షను రద్దు చేసిన ఆర్నెళ్ల తర్వాత ఆమె దేశాన్ని విడిచి వెళ్లారు. అయితే ఈ వార్తలపై పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ఇంతవరకు స్పందించలేదు.

కాగా ఇరుగుపొరుగు వాళ్లతో జరిగిన గొడవలో భాగంగా ఇస్లాం మతాన్ని దూషించిందంటూ ఆసియా బీబీ గురించి వార్తలు ప్రచురితం కాగా పాకిస్తాన్‌ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదనీ.. ఆమెకు కఠిన శిక్ష విధిం‍చాలని కొంతమంది 2009లో కోర్టును ఆశ్రయించారు.  ఈ క్రమంలో లాహోర్‌ హైకోర్టు 2010లో ఆమెకు మరణశిక్ష విధించింది. ఇక ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‌ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు స్వాగతించారు. ఆసియా పాపం పండినందు వల్లే ఆమెకు మరణశిక్ష పడిందని హర్షం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గత ఎనిమిది సంవత్సరాలుగా ‘ఏకాంతవాస’శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది.

గతేడాది అక్టోబరులో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుతో పాకిస్తాన్‌లో మరోసారి ఆగ్రహజ్వాలలు పెల్లుబుకాయి. ఆసియాను కచ్చితంగా చంపేస్తామని..ఆమెను దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ నిరసనకారులు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బీబీ కెనడాలో ఆశ్రయం పొందాలని భావించడంతో ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాకిస్తాన్‌ ప్రభుత్వంలో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆమె పాక్‌ విడిచివెళ్లినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది..
ఆసియా బీబీ తన నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్‌లో నివసిస్తూ ఉండేది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో ఓరోజు పొలంలో పనిచేస్తున్న సమయంలో పక్క పొలం వాళ్లని మంచినీళ్లు కావాలని అడిగింది. అయితే ఆసియా క్రిస్టియన్‌ అనే కారణంతో ఆమెకు నీళ్లు ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఇస్లాం మతం గురించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం దేశవ్యాప్తంగా ప్రముఖంగా ప్రచారం కావడంతో నిరసనలు చెలరేగాయి.

బాడీగార్డే చంపేశాడు..
ఆసియా వ్యాఖ్యలతో సహనం కోల్పోయిన ఇస్లాం మతస్తులు ఆమెతో పాటు.. ఆమెకు మద్దతుగా నిలిచిన వారినీ చంపేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పంజాబ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సల్మాన్‌ తసీర్‌ను ఆయన బాడీగార్డే కాల్చి చంపేశాడు. ఆయనతో ఆసియాకు మద్దతు తెలిపిన మరో ఇద్దరు రాజకీయ నాయకులను దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఇక పాక్‌ మాజీ ప్రధాని జియావుల్‌ హక్‌ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. అయితే, వ్యక్తిగత కక్ష్యసాధింపు చర్యలకు ఈ చట్టాలు అవకాశం కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top