హ్యూస్టన్‌లో నేడే హౌడీ మోదీ

PM Narendra Modi arrives in Houston for mega diaspora event - Sakshi

మోదీకి సభావేదిక వద్ద ఘన స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం

మోదీ, ట్రంప్‌ల ప్రసంగాలు మూడు భాషల్లో ప్రత్యక్ష ప్రసారం

50వేల మంది హాజరయ్యే అవకాశం

200 కార్లతో భారీ ర్యాలీ

హ్యూస్టన్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు ఆదివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హౌడీ, మోదీ!’కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. భారత ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు నిర్వాహకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క పోప్‌ మినహా మరే విదేశీ నేత కూడా అమెరికాలో ఇప్పటి వరకు ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేదు. దాదాపు 50 వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన ఎన్నార్జీ ఫుట్‌బాల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.

ఆదివారం మూడు గంటలపాటు జరిగే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ‘న భూతో న భవిష్యతి’అన్నట్లుగా నిర్వహించేందుకు 1,500 మంది వలంటీర్లు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటూ ‘నమో ఎగైన్‌’ అని ఉన్న టీషర్టులు ధరించిన వలంటీర్లు, నిర్వాహకులు 200 కార్లతో శుక్రవారం ర్యాలీ చేపట్టారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య నేతలు మొదటి సారిగా ఇలాంటి కార్యక్రమానికి హాజరవుతున్నారు.

రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది’అని టెక్సాస్‌ ఇండియన్‌ ఫోరం ప్రతినిధులు వెల్లడించారు. ‘ఈ కార్యక్రమానికి దేశంలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనెటర్లు, గవర్నర్లు, మేయర్లు, ప్రముఖ నేతలు హాజరవుతున్నారు. భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేలా 400 మంది కళాకారులతో గంట పాటు సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో మోదీ, ట్రంప్‌ల ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి’అని తెలిపారు.

అనంతరం మోదీ ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొని, ఐరాస సమావేశాల కోసం న్యూయార్క్‌ బయలుదేరనున్నారు. కాగా, అమెరికాకు వెళ్లే దారిలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో శనివారం కాసేపు ఆగారు. ఆయన ప్రయాణించే ఎయిర్‌ ఇండియా ఒన్‌ విమానం సాంకేతిక కారణాలతో అక్కడ రెండు గంటలపాటు ఆగింది. ప్రధాని ఆ సమయంలో అక్కడి చమురు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి శనివారం రాత్రి మోదీ హ్యూస్టన్‌ చేరుకున్నారు. జార్జిబుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ అమెరికన్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top