మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆగ్రహం
వాషింగ్టన్: వెనెజువెలాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సైనిక ఆపరేషన్‌ను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ నేత కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆపరేషన్ చట్టవిరుద్ధం, అనైతికం అని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో అమెరికాకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశం భద్రంగా, సౌభాగ్యవంతంగా, బలంగా ఉండాలంటే వైఖరి మార్చుకోవాలని ట్రంప్‌కు సూచించారు.
నికోలస్ మదురో నిరంకుశ పాలకుడే అయినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించడం సరైంది కాదన్నారు. వెనెజువెలాలో ఉన్న చమురు కోసమే మదురోను నిర్బంధించారని ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణ, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ సాకులు చెబుతున్నారని ఆక్షేపించారు. ఇతర దేశాల్లో బల ప్రయోగంతో ప్రభుత్వాలను మార్చేయడం, చమురు దోచుకోవడం అమెరికాకు నష్టం కలిగిస్తాయన్నారు. అంతిమంగా అమెరికా ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కమలా హారిస్ స్పష్టంచేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం, వెనెజువెలాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనే ఆశయాలు ట్రంప్ అజెండాలో లేవన్నారు.
ఆయన మనసంతా చమురుపై ఉందని ఆక్షేపించారు. వెనెజువెలాపై సైనిక చర్యను అమెరికా ప్రజలు కోరుకోలేదన్నారు. అబద్ధాలు వినీవినీ వారు ఆలసిపోయారని పేర్కొన్నారు. తనను తాను బలమైన నాయకుడిగా నిరూపించుకోవాలని ట్రంప్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. ప్రాంతీయంగా అస్థిరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని ట్రంప్‌కు సూచించారు. అమెరికా సైనిక దళాలను ప్రమాదంలోకి నెట్టొద్దని కోరారు. వారి ప్రాణాలను బలి పెట్టాలనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇతర దేశాల్లో ఆపరేషన్ల కోసం కోట్లాది డాలర్లు ఖర్చు వృథా చేయడం ఏమిటని ప్రశ్నించారు.


