గల్ఫ్‌తో దశాబ్ధాల అనుబంధం

PM Narendra Modi Addresses Indians, Launches Temple - Sakshi

యూఏఈ, ఒమన్‌ దేశాల పర్యటనలో మోదీ

సాంకేతికతను వికాసం కోసమే వాడాలి.. విధ్వంసానికి కాదు

ప్రకృతిపై పోరాటం కాదు.. మమేకమవ్వాలి

యూఏఈ, గల్ఫ్‌ దేశాలతో బంధం దృఢమైనది

అబుదాబి భారత సంతతి ప్రజల సమావేశంలో వెల్లడి

అబుదాబిలో స్వామినారాయణ్‌ ఆలయానికి శంకుస్థాపన

ఒమన్‌లోనూ భారతీయులతో భేటీ

గల్ఫ్‌ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం యూఏఈ, ఒమన్‌లలో బిజీబిజీగా గడిపారు. ఉదయం దుబాయ్‌లోని ఒపెరా హౌజ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. భారత్‌–యూఏఈ మధ్య శతాబ్దాల నాటి బంధం దృఢమైనదన్నారు. ప్రవాసీల కలల సాకారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం అబుదాబిలో నిర్మించనున్న స్వామినారాయణ్‌ మందిరానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. దుబాయ్‌లో వరల్డ్‌ గవర్నమెంట్‌ సమిట్‌లో ప్రారంభోపన్యాసం చేశారు. సాంకేతికతను వికాసానికే వాడాలి తప్ప విధ్వంసానికి కాదని సూచించారు. దుబాయ్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌తో సమావేశమై రక్షణ, వాణిజ్యరంగాల్లో ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై చర్చించారు. అక్కడినుంచి ఒమన్‌ చేరుకున్న ప్రధాని.. మస్కట్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఒమన్‌ పురోగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.

దుబాయ్‌/మస్కట్‌
సైబర్‌ స్పేస్‌ దుర్వినియోగం కాకుండా, ఉగ్రవాదుల చేతిలో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించే ఓ నియంత్రణ వ్యవస్థగానే వినియోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ సమిట్‌లో మోదీ ప్రసంగించారు. సైబర్‌స్పేస్‌ను ఉగ్రవాదులు, హ్యాకర్లు దుర్వినియోగం చేస్తున్నారని దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాలనకు సరైన సాంకేతికత తోడైతే సరైన అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత పురోగతిలో సాంకేతికత పాత్రను మోదీ తన ప్రసంగంలో వివరించారు. కృత్రిమ మేధస్సు, నానో టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితర రంగాల్లో భారత్‌ త్వరలోనే కీలకస్థానం అందుకోనుందన్నారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

‘6ఆర్‌’లు, ‘5ఈ’ల సూత్రంతోనే..
భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘సాంకేతికతతో ప్రకృతిపై పోరాటం చేయటం భవిష్యత్‌ మానవాళికి ప్రమాదకరం. ప్రకృతితో పోరాటం చేయవద్దు. దాంట్లో మమేకమయ్యే ప్రయత్నం చేయాలి’ అని మోదీ సూచించారు. ‘6ఆర్‌’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్‌), ‘5ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు. సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. గల్ఫ్‌ సహకార మండలి వ్యాపారవేత్తలతోనూ ప్రధాని సమావేశమై ‘నవభారతం’ విజన్‌ను వారితో పంచుకున్నారు. పెట్టుబడులతో భారత్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. ఫ్రెంచ్‌ ప్రధాని ఎడ్వర్డ్‌ ఫిలిప్పీ, కిర్గిజ్‌స్తాన్‌ ప్రధాని సపర్‌ ఇసాకోవ్‌లతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు.

భారత్‌–యూఏఈ బంధం దృఢమైంది
యూఏఈ, ఇతర గల్ఫ్‌ దేశాలతో భారత్‌కు ఉన్న బంధం అమ్మకపుదారు–కొనుగోలుదారు పరిధికంటే లోతైనది, విస్తృతమైనదని, బలమైనదని మోదీ తెలిపారు. దుబాయ్‌ ఒపెరా హౌజ్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. దేశం, కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. 30 లక్షల మంది భారతీయులకు యూఏఈ సొంతింటిలా అక్కున చేర్చుకుందన్నారు. ప్రవాసీయుల కలలను నిజం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. ‘ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూల జాబితాలో భారత్‌ స్థానం చాలా మెరుగుపడింది. ఇంతటితో సంతృప్తి చెందాలనుకోవట్లేదు. దీన్ని మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’ అని అన్నారు.  

అబుదాబిలో దేవాలయ శంకుస్థాపన
అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. బీఏపీఎస్‌ నారాయణ్‌ ఆలయానికి ఒపెరా హౌజ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘యూఏఈ పాలకులు భారత్‌పై, భారత సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే ఇక మన పాత్ర నిర్వహణలో ఎలాంటి పొరపాట్లూ ఉండకూడదని ఈ ఆలయ నిర్మాణంతో ముడిపడిఉన్న అందరికీ చెబుతున్నా. మనం ఎవరికీ ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దు. మీనుంచి ఇదే ఆశిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మందిర నిర్మాణానికి స్థలాన్నిచ్చిన అబుదాబి యువరాజుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

దోశ, బీట్‌రూట్‌ కబాబ్, పప్పు!
ప్రధాని నరేంద్ర మోదీ ఆహారంతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలను తినే వ్యక్తి కాదనీ, మాంసాహారాన్ని ముట్టని మోదీ ఎలాంటి శాకాహార వంటలనైనా ఆరగించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆయన ఆహారాన్ని సంజీవ్‌ కపూర్‌ తయారుచేస్తున్నారు. దోశ, బీట్‌రూట్‌తో చేసిన కబాబ్, పప్పు, అన్నం ఎప్పుడూ మోదీ ప్లేట్‌లో ఉంటాయని సంజీవ్‌ పేర్కొన్నారు. ఒక దేశం సంస్కృతీ సంప్రదాయాలను మరో దేశం సులభంగా తెలుసుకునేందుకు ఆహారాన్ని మంచి మార్గంగా మోదీ భావిస్తారన్నారు. వంటకు సంబంధించి మోదీ కొన్ని కొత్త విషయాలను తనకు నేర్పించారని సంజీవ్‌ చెప్పారు.  

ఒమన్‌.. మినీ ఇండియా!
యూఏఈ నుంచి రెండ్రోజుల పర్యటనకోసం ప్రధాని ఒమన్‌ చేరుకున్నారు. మస్కట్‌లో మోదీకి ఒమన్‌ ఉప ప్రధాని సయ్యద్‌ ఫహద్‌ బిన్‌ మహమ్మద్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం సుల్తాన్‌ ఖబూస్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ స్టేడియంలోని రాయల్‌ బాక్స్‌ నుంచి వీక్షించారు. ‘ఒమన్‌లోని 8 లక్షల మంది భారతీయులు.. సౌహార్ద్ర రాయబారులే. ఒమన్‌ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించారు. అందుకే ఒమన్‌ను చూస్తుంటే మినీ భారత్‌లా అనిపిస్తోంది. ఇరుదేశాల్లో రాజకీయ మార్పులొచ్చినా.. భారత్‌–ఒమన్‌ సంబంధాల్లో మాత్రం ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదు’ అని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కుంభకోణాల కారణంగా భారత ప్రతిష్ట మసకబారిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేశారు. పశ్చిమాసియాతో భారత్‌ సంబంధాల్లో ఇదొక కొత్త శకమన్నారు. తమ ప్రభుత్వ పథకాలను మోదీ వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారందరితో వందేమాతరం అని నినాదాలు చేయించారు. దీంతో స్టేడియం మార్మోగిపోయింది. వాహనంలో తిరుగుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అభివాదం చేశారు.


     మస్కట్‌లో మోదీకి స్వాగతం పలుకుతున్న ఒమన్‌ ఉపప్రధాని ఫహద్‌ బిన్‌ మహమూద్‌ అల్‌ సయిద్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top