‘టెర్రరిస్ట్‌ ఫండింగ్‌ వాచ్‌ లిస్ట్‌’లో పాక్‌! | Pakistan put on terrorist financing watchlist | Sakshi
Sakshi News home page

‘టెర్రరిస్ట్‌ ఫండింగ్‌ వాచ్‌ లిస్ట్‌’లో పాక్‌!

Feb 24 2018 1:50 AM | Updated on Apr 4 2019 3:25 PM

Pakistan put on terrorist financing watchlist - Sakshi

పాక్‌ ప్రధాని అబ్బాసీ (ఫైల్‌)

పారిస్‌: అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు మరో పరాభవం. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్న ఆ దేశాన్ని ‘టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ వాచ్‌ లిస్ట్‌’లో మళ్లీ చేర్చడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. పారిస్‌లో జరుగుతున్న ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌పోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) ప్లీనరీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

పాక్‌ను ఆ జాబితాలో చేర్చాలని అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి తొలుత మోకాలడ్డిన చైనా, టర్కీ, సౌదీ అరేబియాలు వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా, ఇతర సభ్య దేశాల ఒత్తిళ్ల మేరకే చైనా తన వైఖరి మార్చుకున్నట్లు తెలిసింది.

ఉగ్ర ఫండింగ్, మనీ ల్యాండరింగ్‌ వ్యతిరేక నిబంధనలకు లోబడని పాక్‌ను దారిలోకి తేవడానికే అమెరికా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. 2012–15 మధ్య కాలంలో పాకిస్తాన్‌ ‘టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ వాచ్‌ లిస్ట్‌’లో ఉంది. పాకిస్తాన్‌ మరోసారి ఆ నిషేధిత జాబితాలో చేరితే ఆర్థికంగా దెబ్బ తింటుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల సేవలు కోల్పోనుంది. గతంలో టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ వాచ్‌ లిస్ట్‌లో ఉన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్‌) నుంచి బెయిల్‌ అవుట్‌ పొంది గట్టెక్కింది.   

ఆలస్యంగా మేల్కొన్నా ఫలితం శూన్యం!
ఇటీవల ఉగ్ర సంస్థలపై పాకిస్తాన్‌ కొరడా ఝుళిపించింది. జమాతే చీఫ్‌ సయీద్‌కు చెందిన కొన్ని ఆస్తులు, మదర్సాలను స్వాధీనం చేసుకుని ఉగ్ర వ్యతిరేక చర్యలను ప్రారంభించినట్లు బాహ్య ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. జమాతే, ఎఫ్‌ఐఎఫ్‌ అనే సంస్థలను నిషేధిస్తున్నట్లు అధ్యక్షుడు మమ్నూన్‌ హుసేన్‌ ఫిబ్రవరి 9న ఆర్డినెన్స్‌ జారీ చేశారు. టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ వాచ్‌ లిస్ట్‌లో తన పేరు చేర్చకుండా ఉండేందుకు పాకిస్తాన్‌ ఈ వారంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ సభ్య దేశాలతో బేరసారాలు నిర్వహించింది. అమెరికా ప్రయత్నాలను భగ్నం చేసినట్లు పాక్‌ విదేశాంగ మంత్రి  ఖవాజా ఆసిఫ్‌ మూడు రోజుల క్రితం తొందరపడి ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement