breaking news
funding release
-
కేంద్రం బంపరాఫర్, స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా
న్యూఢిల్లీ: తనఖా లేని రుణాలు పొందడంలో అంకుర సంస్థలకు తోడ్పాటు అందించేలా కేంద్ర ప్రభుత్వం రుణ హామీ పథకాన్ని (సీజీఎస్ఎస్) ప్రకటించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం అర్హత కలిగిన స్టార్టప్‌లు అక్టోబర్ 6న లేదా ఆ తర్వాత మెంబర్ సంస్థల (ఎంఐ) నుంచి తీసుకున్న రుణాలకు ఈ స్కీము వర్తిస్తుంది. ఒక్కో రుణగ్రహీతకు గరిష్టంగా రూ. 10 కోట్ల వరకూ గ్యారంటీ లభిస్తుంది. స్టార్టప్‌ల నిధుల అవసరాలకు ఈ పథకం సహాయపడగలదని డీపీఐఐటీ తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లను (ఏఐఎఫ్) ఎంఐలుగా వ్యవహరిస్తారు. గుర్తింపు పొంది .. స్థిరంగా ఆదాయాన్ని పొందే స్థాయికి చేరుకున్న స్టార్టప్‌లకు ఈ స్కీము వర్తిస్తుంది. సదరు స్టార్టప్‌లు ఏ ఆర్థిక సంస్థకు డిఫాల్ట్ కాకూడదు. అలాగే మొండిపద్దుగా ఉండకూడదు. ఈ స్కీము అమలు కోసం కేంద్రం ప్రత్యేక ట్రస్టు లేదా ఫండ్ ఏర్పాటు చేస్తుంది. బోర్డ్ ఆఫ్ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ఈ ఫండ్‌కి ట్రస్టీగా వ్యవహరిస్తుంది. ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు డీపీఐఐటీ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది. -
ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు
న్యూఢిల్లీ: సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) రుణ వితరణ పరంగా సమస్యల్లేకుండా చూసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థం అవుతోంది. పీఎస్‌బీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఆర్థిక రంగ ప్రేరణకుగాను వాటికి మరో రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బ్యాంకులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆన్ లైన్ లో వ్యక్తిగత రుణాలను, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించాలని మంత్రి సూచించారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు కస్టమర్, ఇతర అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలను అందుకునే విధంగా ఉండాలన్నారు. ఖాతాదారుల అనుమతితోనే.... ‘‘ఖాతాదారులకు వారి ఖాతాల్లో ఇతరులు చేసే డిపాజిట్ల విషయంలో ప్రస్తుతం పూర్తి నియంత్రణ లేదు. ఖాతాదారుల అనుమతితోనే ఇతరులు డిపాజిట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీఎస్బీల్లో గవర్నెన్స్ బలోపేతం చేసేందుకు సంస్కరణలు కూడా తీసుకొస్తాం’’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనాల ద్వారా ఇప్పటికి 8 బ్యాంకులను తగ్గించినట్టు ప్రకటించారు. బ్యాంకులకు అదనంగా 1.34 లక్షల కోట్లు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య నేపథ్యంలో బ్యాంకులకు అదనంగా రూ.1.34 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ముందుకు వచ్చింది. ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ కల్పనకు దోహదం చేస్తుంది. -
‘టెర్రరిస్ట్ ఫండింగ్ వాచ్ లిస్ట్’లో పాక్!
పారిస్: అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు మరో పరాభవం. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్న ఆ దేశాన్ని ‘టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్’లో మళ్లీ చేర్చడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. పారిస్‌లో జరుగుతున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ప్లీనరీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పాక్‌ను ఆ జాబితాలో చేర్చాలని అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి తొలుత మోకాలడ్డిన చైనా, టర్కీ, సౌదీ అరేబియాలు వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా, ఇతర సభ్య దేశాల ఒత్తిళ్ల మేరకే చైనా తన వైఖరి మార్చుకున్నట్లు తెలిసింది. ఉగ్ర ఫండింగ్, మనీ ల్యాండరింగ్ వ్యతిరేక నిబంధనలకు లోబడని పాక్‌ను దారిలోకి తేవడానికే అమెరికా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. 2012–15 మధ్య కాలంలో పాకిస్తాన్ ‘టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్’లో ఉంది. పాకిస్తాన్ మరోసారి ఆ నిషేధిత జాబితాలో చేరితే ఆర్థికంగా దెబ్బ తింటుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల సేవలు కోల్పోనుంది. గతంలో టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ పొంది గట్టెక్కింది. ఆలస్యంగా మేల్కొన్నా ఫలితం శూన్యం! ఇటీవల ఉగ్ర సంస్థలపై పాకిస్తాన్ కొరడా ఝుళిపించింది. జమాతే చీఫ్ సయీద్‌కు చెందిన కొన్ని ఆస్తులు, మదర్సాలను స్వాధీనం చేసుకుని ఉగ్ర వ్యతిరేక చర్యలను ప్రారంభించినట్లు బాహ్య ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. జమాతే, ఎఫ్ఐఎఫ్ అనే సంస్థలను నిషేధిస్తున్నట్లు అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్ ఫిబ్రవరి 9న ఆర్డినెన్స్ జారీ చేశారు. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్‌లో తన పేరు చేర్చకుండా ఉండేందుకు పాకిస్తాన్ ఈ వారంలో ఎఫ్ఏటీఎఫ్ సభ్య దేశాలతో బేరసారాలు నిర్వహించింది. అమెరికా ప్రయత్నాలను భగ్నం చేసినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ మూడు రోజుల క్రితం తొందరపడి ప్రకటించారు. -
ఆలయాలకు మహర్దశ
► రెండు దఫాలుగా ఎంపిక.. నిధుల విడుదల ► ఇప్పటికే మొదటి దఫా గుళ్లల్లో పనులు ► ఇటీవలే ఆలయాలకు పాలకవర్గాల నియామకం ► పనులపై దృష్టిపెట్టిన మంత్రి, అధికారులు నిర్మల్‌రూరల్: అడుగడుగునా గుడులున్న జిల్లాగా పేరున్న నిర్మల్‌లోని ఆలయాలకు మహర్దశ పట్టింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొలువుదీరిన కొత్త సర్కార్ ఆలయాలాభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా నిధులు అందిస్తోంది. దీంతో జిల్లాలోనూ ఆలయాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. దీనికి తోడు జిల్లా నుంచే దేవాదాయశాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉండడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కాగా, మరికొన్ని గుడులలో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రెండు దఫాలుగా ఎంపిక.. జిల్లాలోని ఆలయాల అభివృద్ధిలో భాగంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇప్పటికే పలు కోవెలలను ఎంపిక చేసి పనులు చేపడుతోంది. వీటిని మొదటి ఫేజ్ కింద పరిగణిస్తున్నారు. ఇందులో మొత్తం 81ఆలయాలున్నాయి. వీటి అభివృద్ధికి కామన్‌గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద రూ.11కోట్ల 9లక్షలు మంజూరు చేశారు. ఈ దఫాలోని ఆలయాల అభివృద్ధి పనులు దాదాపు ప్రారంభమయ్యాయి. ఇక రెండో దశ కింద 313 ఆలయాలను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటికే 24ఆలయాలకు సీజీఎఫ్ ద్వారా రూ.63లక్షలు మంజూ రు చేశారు. మిగతా 292 గుడులకూ త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయాన్ని బట్టి నిధులు.. జిల్లాలో బాసరలో చదువులమ్మ కోవెల మొదలుకుని గ్రామాల్లోని భీమన్న ఆలయాల వరకు దేవాదాయశాఖ నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో ఆలయాల అభివృద్ధి పనులు, స్థాయిని బట్టి నిధులు కేటాయిస్తోంది. బాసరకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రణాళిక సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ప్రణాళికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆలయాలు.. విడుదలైన నిధులు సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ దేవస్థానానికి రూ.కోటి, దిలావర్పూర్ మండల కాల్వ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ.35లక్షలు, కదిలి పాపహరేశ్వరాలయానికి రూ.15లక్షలు, జిల్లాకేంద్రంలోని దేవరకోట దేవస్థానానికి రూ.20లక్షలు, వీరహనుమాన్ ఆలయానికి రూ.20లక్షలు, బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయానికి రూ.10లక్షలు, కురన్నపేట్ వేంకటేశ్వరస్వామి(బత్తీస్గఢ్) ఆలయానికి రూ.25లక్షలు, బ్రహ్మపురి రాంమందిర్కు రూ.10లక్షలు, బంగల్పేట్ బోయవాడ హన్మాన్ మందిరానికి రూ.8లక్షలు, ఖిల్లాగుట్టపై గల చాందమహంకాళీ ఆలయానికి రూ.5లక్షలు, నగరేశ్వరవాడ భూలక్ష్మి మందిరానికి రూ.10లక్షలు, నగరేశ్వరాలయానికి రూ.5లక్షలు, కురన్నపేట శివాలయానికి రూ.10లక్షల చొప్పున మొదటి ఫేజ్‌లో నిధులు విడుదల చేశారు. వేగంగా సాగుతున్న పనులు.. మొదటి ఫేజ్‌లో నిధులు మంజూరు చేసిన ఆలయాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కాల్వలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పూర్తిగా తొలగించి నూతన మందిరాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మిగతా ఆలయాల్లోనూ మరమ్మతులు, మండపాలు, గోపురాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దేవరకోటలో గతంలో వేసిన షెడ్డు పాడవ్వడంతో రూ.20లక్షలతో నూతన షెడ్డును వేయనున్నారు. కొలువుదీరిన పాలకవర్గాలు.. ఓ వైపు నిధులను కేటాయించడంతో పాటు మరోవైపు ఆలయాల పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే పాలకవర్గాలనూ నియమించింది. అన్నింటికంటే ముందు అడెల్లి మహాపోచమ్మ దేవస్థానం పాలకమండలి ఖరారైంది. చైర్మన్‌గా వంజర్కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి నియమితులు కాగా, మరో ఆరుగురు ధర్మకర్తలుగా నియమితులయ్యారు. బాసరలో చైర్మన్‌గా ఫౌండర్ ట్రస్టీ శరత్‌పాఠక్ కొనసాగగా, 13మంది ధర్మకర్తలుగా ఉన్నారు. కాల్వ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్‌గా ఇప్ప నర్సారెడ్డి, కదిలి పాపహరేశ్వరాలయం చైర్మన్‌గా శంభాజీపటేల్ నియమితులయ్యారు. ఈ ఆలయాల్లోనూ ఆరుగురు చొప్పున ధర్మకర్తలున్నారు. ఇక జిల్లాకేంద్రంలోని ప్రముఖ దేవరకోట లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా ఆమెడ కిషన్ నియమితులయ్యారు. మరో ఆరుగురు ఇక్కడ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని ఆలయాలకు పాలకవర్గాలు రావడంతో సమస్యలు తీరుతాయని భక్తులు ఆశిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహాయం తీసుకుంటామని ఆలయాల చైర్మన్లు చెబుతున్నారు. అమాత్యుడి అండతో.. దేవాదాయశాఖ రాష్ట్ర మంత్రిగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉండడంతో జిల్లాలో ఆలయాల అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఇటీవల పలు సభలు, కార్యక్రమాల్లోనూ ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆలయాలనూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడలతో సమానంగా జిల్లాలోని ఆలయాలను తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు. మంత్రి కృషితోనే నిధులు మంజూరవుతూ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే అభివృద్ధి పనులు జిల్లాకేంద్రంలోని ప్రముఖ చారిత్రక ఆలయమైన దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతాం. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో ఇప్పటికే రూ.20లక్షలు మంజూరయ్యాయి. మరిన్ని నిధులు రాబట్టి ఆలయాన్ని నిర్మల్ తిరుమలగా మారుస్తాం. – ఆమెడ కిషన్,దేవరకోట దేవస్థానం చైర్మన్, నిర్మల్ రెండో దశ ఆలయాలకూ.. జిల్లాలో మొదటి దశలో 81ఆలయాలకు రూ.11కోట్ల 9లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులు కొనసాగుతున్నాయి. రెండో దశలో 313 ఆలయాలకు గానూ ఇప్పటికే 24ఆలయాలకు రూ.63లక్షలు మంజూరయ్యాయి. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో త్వరలోనే మిగతా ఆలయాలకు నిధులు మంజూరు చేస్తాం. – రంగు రవికిషన్‌గౌడ్, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్.