‘హెచ్‌1బీ’ కోటాలో కోత లేదు

No H1B Visa caps in retaliation for data localisation - Sakshi

భారత్‌కు స్పష్టం చేసిన అమెరికా విదేశాంగ శాఖ

అన్ని వీసాలను సమీక్షిస్తున్నామని వెల్లడి  

వాషింగ్టన్‌: విదేశీ కంపెనీలు సేకరించే సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని కోరే దేశాలకు జారీచేస్తున్న హెచ్‌1బీ వీసాల్లో ఎలాంటి కోత విధించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. డేటా ప్రవాహంపై భారత్‌తో అమెరికా జరుపుతున్న చర్చలకు, హెచ్‌1బీ వీసాల జారీపై ట్రంప్‌ యంత్రాంగం చేస్తున్న సమీక్షలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. విదేశీ కంపెనీలు భారత్‌లో సేకరించిన సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని కేంద్రం గతంలోనే సూచించింది.

దీంతో అమెరికా కంపెనీలపై ఇలాంటి నిబంధనలు విధించే దేశాలకు జారీచేస్తున్న హెచ్‌1బీ వీసాల్లో 10–15 శాతం కోత విధించాలని అగ్రరాజ్యం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వీటిని ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా హెచ్‌1బీ సహా అన్ని వర్క్‌ వీసా ప్రోగ్రామ్‌లను ప్రభుత్వం సమీక్షిస్తోందని ఆయన తెలిపారు. ‘ఈ సమీక్షలు ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుని నిర్వహించడం లేదు. భారత్‌తో జరుగుతున్న చర్చలకు, హెచ్‌1బీ సమీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. దేశాల సరిహద్దును దాటి సమాచారం స్వేచ్ఛగా ప్రయాణించాల్సిన అవసరంపై అమెరికా భారత్‌తో చర్చిస్తోంది’ అని వెల్లడించారు.

డేటాను గ్లోబల్‌ సర్వర్లలో కాకుండా స్థానికంగా భద్రపరచాల్సివస్తే వ్యయాలు పెరుగుతాయని విదేశీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. అత్యంత నైపుణ్యవంతులైన విదేశీయులు తమదేశంలో పనిచేసేందుకు వీలుగా ఏటా హెచ్‌1బీ వీసాలను అమెరికా జారీచేస్తోంది. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ట్రంప్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని పలువురు      ఇమిగ్రేషన్‌ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ప్రస్తుత ఇమిగ్రేషన్‌ చట్టానికి సవరణ చేస్తేనే ఇది సాధ్యమనీ, అయితే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు, సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇది జరగడం కష్టమేనని వ్యాఖ్యానించారు. భారత్‌కు జారీచేస్తున్న హెచ్‌1బీ కోటాలో కోత విధిస్తే నిపుణుల రాక తగ్గి అంతిమంగా అమెరికాయే నష్టపోతుందని హెచ్చరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top