విద్వేష విధ్వంస వాదం

India Slams Pakistan PM Imran Khan At UN Platform - Sakshi

ఐరాస వేదికగా పాక్‌ ప్రధానిపై భగ్గుమన్న భారత్‌..

బిన్‌ లాడెన్‌ను సమర్థించలేదని న్యూయార్క్‌ ప్రజల ముందు ఇమ్రాన్‌ చెప్పగలరా?

ఐరాస గుర్తించిన 130 మంది ఉగ్రవాదులకు, 25 ఉగ్రవాద సంస్థలకు పాక్‌ ఆశ్రయం ఇవ్వలేదని అనగలరా? 

ఉగ్రవాదిగా అంతర్జాతీయ సమాజం గుర్తించిన వ్యక్తికి ప్రభుత్వ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక దేశం పాక్‌ కావడం నిజం కాదా?

భారత పౌరుల తరఫున ఉగ్రవాద ఉత్పత్తి దేశం మాట్లాడాల్సిన అవసరం లేదని స్పషీ్టకరణ 

మధ్యయుగాల ఆటవిక మనస్తత్వాన్ని ఇమ్రాన్‌ ప్రదర్శించారని మండిపాటు 

ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై విషం కక్కిన పాకిస్తాన్‌కు అదే వేదిక నుంచి భారత్‌ దీటైన జవాబిచ్చింది. ఐరాస 74వ సాధారణ సభ సమావేశాల్లో శుక్రవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగానికి, ఆయన చేసిన ఆరోపణలకు శనివారం భారత్‌ సమాధానమిచ్చింది. ఆ ప్రసంగం ద్వారా మధ్యయుగాల ఆటవిక మనస్తత్వాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బయటపెట్టుకున్నారని మండిపడింది. భారత్‌ తరఫున సభలో ఐరాసలోని భారత పర్మనెంట్‌ మిషన్‌ ఫస్ట్‌ సెక్రటరీ విదిష మైత్ర మాట్లాడారు. ఐరాస వేదికగా దార్శనికతను కాకుండా విధ్వంసవాదాన్ని ఇమ్రాన్‌ ప్రదర్శించారని ఆమె విమర్శించారు.
(చదవండి : పాక్‌ తీరును ఎండగట్టిన గులాలయీ ఇస్మాయిల్‌)

కశ్మీర్‌పై ఇమ్రాన్‌ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. భారత పౌరుల తరఫున వేరే ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదని.. ముఖ్యంగా విద్వేష పునాదుల పైన ఉగ్రవాద పరిశ్రమను నిర్మించిన వారి నుంచి అస్సలు లేదని తేల్చి చెప్పారు. ‘ఈ వేదిక నుంచి మాట్లాడే ప్రతీ మాటకు పవిత్రత ఉంటుంది.. చరిత్రలో నిలిచిపోతుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ వేదికపై పాకిస్తాన్‌ ప్రధాని విభజనవాదాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లింలు వర్సెస్‌ మిగతావారు, అమెరికా వర్సెస్‌ ఇతరులు, సంపన్నులు వర్సెస్‌ పేదవారు, ఉత్తర వర్సెస్‌ దక్షిణ, అభివృద్ధి చెందిన వర్సెస్‌ అభివృద్ధి చెందుతున్న.. ఇలా ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికపై విభజనవాదాన్ని, విద్వేషవాదాన్ని ప్రదర్శించారు.

ఆయన చేసింది ఒక్కమాటలో చెప్పాలంటే.. విద్వేష ప్రసంగం’అని తేల్చిచెప్పారు. ‘దౌత్య సంబంధాల్లో మాటలే కీలకం. ఇలాంటి చోట రక్తపాతం, తుపాకీ పట్టుకోవడం, జాత్యాధిక్యత, చివరి వరకు పోరాడటం, ఊచకోత.. లాంటి మాటలు ఉపయోగించడం మధ్యయుగాల నాటి ఆటవిక మనస్తత్వాన్ని బయటపెట్టుకోవడమే’అని మండిపడ్డారు. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి కారణమైన 1971 యుద్ధ సమయంలో తమ సొంత ప్రజలపైనే పాకిస్తాన్‌ జరిపిన ఊచకోతను, రక్తపాతాన్ని, ఆ సమయంలో పాకిస్తాన్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజీ పాత్రను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తమది అణ్వాయుధ దేశమంటూ అంతర్జాతీయ సమాజాన్ని బెదిరించడం రాజనీతిజ్ఞత కాబోదని, అది ఆటవిక, విధ్వంసవాదమని పాక్‌ తీరును ఎండగట్టారు. ఉగ్రవాద ఉత్పత్తిలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న దేశమంటూ పాక్‌ను విమర్శించారు. అలాంటి దేశం నుంచి వచి్చన ఒక నాయకుడు ఉగ్రవాదాన్ని సమరి్ధస్తూ ఐరాస వేదికగా చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసిందన్నారు.  

పాక్‌కు కొన్ని ప్రశ్నలు.. 
పాక్‌లో ఉగ్ర సంస్థలు లేవని, కావాలంటే ఐరాస పరిశీలకులు వచ్చి చూసుకోవచ్చని ఇమ్రాన్‌ తన ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఇమ్రాన్‌ను పలు ప్రశ్నలు వేశారు. ‘ఒసామా బిన్‌ లాడెన్‌ను సమరి్ధంచలేదని న్యూయార్క్‌ ప్రజల ముందు చెప్పగలరా?, ఐరాస గుర్తించిన 130 మంది ఉగ్రవాదులకు, 25 ఉగ్రవాద సంస్థలకు పాక్‌ ఆశ్రయం ఇవ్వలేదని చెప్పగలరా?, ఉగ్రవాదిగా అంతర్జాతీయ సమాజం గుర్తించిన వ్యక్తికి ప్రభుత్వ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్తానే కావడం నిజం కాదా?’అంటూ ఇమ్రాన్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు. జంటిల్‌మెన్‌ గేమ్‌గా పేరున్న క్రికెట్‌ ఆటగాడైన ఇమ్రాన్‌.. ఇలా దారుణంగా మొరటు ప్రసంగం చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని మైనారిటీల గురించి ఇమ్రాన్‌ మాట్లాడటంపై స్పందిస్తూ.. పాక్‌లో 1947లో 23% ఉన్న మైనారిటీల శాతం, ఇప్పుడు 3 శాతానికి పడిపోవడాన్ని గుర్తు చేశారు. పాక్‌లో మైనారిటీలైన హిందూ, సిఖ్, పార్శీ, క్రిస్టియన్, సిం«దీ, అహ్మదీయ, షియా, పష్తూన్, బలోచీలపై దారుణమైన చట్టాలను ప్రయోగిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.   

ఐరాసలో కశ్మీర్‌ అంశం ప్రస్తావన
యునైటెడ్‌ నేషన్స్‌/న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 74వ సమావేశాల్లో కశ్మీర్‌ అంశాన్ని పొరుగుదేశం చైనా లేవనెత్తింది. చాన్నాళ్లుగా సాగుతున్న ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉందంటూ పేర్కొంది. ‘ఐరాస నిబంధనలు, భద్రతామండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందం ప్రాతిపదికగా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి’అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి సూచించారు. భారత్, పాకిస్తాన్‌ల పొరుగుదేశంగా ఈ సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని, ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటున్నామన్నారు. ఐరాసలో చైనా కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్‌ ఖండించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top