ముందు అణ్వస్త్రాలు ప్రయోగించం: పాక్‌

Imran Khan Says They Wont Use Nuclear Weapons First - Sakshi

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌ అంశాన్ని రాజకీయం చేసి అంతర్జాతీయ సమాజం మద్దతు పొందాలని ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు అడుగడునా భంగపాటే ఎదురవుతోంది. ఐక్యరాజ్యసమితి సహా ప్రధాన దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ఈ క్రమంలో దాయాది దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సహా పలువురు మంత్రులు రోజుకో రకం వ్యాఖ్యలు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన జరిగిన నాటి నుంచి పాక్‌ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ తమ అంతర్గత అంశమని భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు స్పష్టం చేస్తున్నా పాకిస్తాన్‌ మాత్రం పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సహనాన్ని పరీక్షిస్తోంది. అణు యుద్ధానికి సిద్ధమన్న ఇమ్రాన్ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. ఇందుకు తోడు యుద్ధ క్షిపణిని పరీక్షించి కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్‌.. తమ వద్ద మినీ అణు బాంబులు ఉన్నాయని..వాటితో లక్ష్యాలను సులభంగా ఛేదించవచ్చని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది.

చదవండి : మరోసారి భంగపడ్డ పాకిస్తాన్‌!

ఈ క్రమంలో తొలుత భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాత స్వరం మార్చి... చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇక తాజాగా ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి అణు యుద్ధం గురించి ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేశారు. లాహోర్‌లో జరిగిన అంతర్జాతీయ సిక్కు సదస్సులో పాల్గొన్న ఆయన సోమవారం మాట్లాడుతూ.. ‘భారత్‌- పాక్‌ రెండు అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు. ఒకవేళ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరితే అది ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అయితే ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. పాకిస్తాన్‌ ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించబోదు. అణ్వస్త్రాలను ప్రయోగించదు. నిజానికి యుద్ధంలో ఓడిన దేశంతో పాటు గెలిచిన దేశం కూడా కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది’ అని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top