ట్రంప్‌పై మళ్లీ అభిశంసన ? 

Impeachment Of America President Donald Trump - Sakshi

వివిధ కేసుల్లో దోషులుగా మారుతున్న సహచరులు

నవంబర్‌ ఎన్నికలు రిఫరెండం కావచ్చు

డెమొక్రాట్ల సంఖ్య పెరిగితే అభిశంసనకు సన్నాహాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెడ మీద అభిశంసన కత్తి వేళ్లాడుతోందా ? ట్రంప్‌ ఎదుర్కొంటున్న న్యాయ వివాదాలు ఆయన పదవికే ఎసరు పెడతాయా ? మరోసారి ట్రంప్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న చర్చ మొదలైంది. అసలు అమెరికా అధ్యక్షుడిని అభిశంసించే ప్రక్రియ  ఎలా సాగుతుంది ? ట్రంప్‌ భవిష్యత్‌ ఏమిటి ? 

చిక్కుల్లో ట్రంప్‌ 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సాగుతున్న విచారణలో భాగంగా ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ , ప్రచార మాజీ మేనేజర్‌ పాల్‌ మనాఫోర్ట్‌ లు కోర్టుల్లో దోషులుగా తేలడం ఒక్కసారిగా ట్రంప్‌ను చిక్కుల్లోకి నెట్టేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన  సెక్స్‌ స్కాండల్‌  ముడుపుల వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడడంతో ట్రంప్‌ ఎన్నడూ లేనివిధంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ పన్నుల ఎగవేత, బ్యాంకుల్ని మోసగించడం, ప్రచార ఆర్థిక చట్టాల ఉల్లంఘన నేరాలను కోర్టు ఎదుట అంగీకరించడం ట్రంప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.

అంతేకాదు ట్రంప్‌తో తమకు లైంగిక సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న ప్లేబాయ్‌ మోడల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్, పార్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్‌లు నోరు మూయించడానికి మూడో కంటికి తెలీకుండా ముడుపులు చెల్లించాలని  ట్రంప్‌ తనకు చెప్పారంటూ కోహెన్‌ కోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్‌ను గద్దె దింపుతారా అన్న చర్చకు దారి తీశాయి.  ట్రంప్‌ సైతం తనను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలి అందరూ పేదవాళ్లయిపోతారని బెదిరించారంటే ఆయన కూడా ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతోంది. 

అధ్యక్షుడి అభిశంసన ఎలా ? 
అమెరికా అధ్యక్షుడిని అభిశంసించడం అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘమైన ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభలో సభ్యులెవరైనా అధ్యక్షుడి తప్పుల్ని ఎత్తి చూపుతూ అభిశంసనకు ప్రతిపాదించవచ్చు. దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, ఘోరమైన నేరానికి పాల్పడడం, దుష్ప్రవర్తన (అధికార దుర్వినియోగం, ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీయడం దుష్ప్రవర్తన కిందకి వస్తాయి)  వంటి కారణాలతో అభిశంసించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా  హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ఎదుట విచారణకు వస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆ కమిటీ విచారణలో ఆరోపణలు నిజమేనని తేలితే ఏయే ఆర్టికల్స్‌ కింద నేరారోపణలు చేశారనేది నిర్ధారిస్తారు.

ఆ ఆర్టికల్స్‌పై మళ్లీ సభలో సమగ్రమైన చర్చ జరిగి ఓటింగ్‌ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని సభ ఆమోదిస్తే, దానిని సెనేట్‌కు పంపుతారు. అక్కడ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. 

ట్రంప్‌ను ఇప్పుడు ఎలా అభిశంసిస్తారు ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎఫ్‌బిఐ ప్రత్యేక న్యాయవాది రాబర్ట్‌ ముల్లర్‌ చేస్తున్న విచారణలో వెల్లడవుతున్న నిజాలు, తాజా పరిణామాలు ట్రంప్‌ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. రాజకీయంగానూ ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రచార ఆర్థిక నేరాల్లో ట్రంప్‌ ఆంతరంగికులు ఒక్కొక్కరుగా న్యాయ స్థానాల్లో దోషులుగా తేలుతున్నారు. ముల్లర్‌ విచారణలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేస్‌ ఫ్లిన్, ట్రంప్‌ అనుచరుడు జార్డ్‌ పపడోపోలస్‌లు ఇప్పటికే రష్యాతో ట్రంప్‌ శిబిరం సాన్నిహిత్యంపై తాము అబద్ధాలే చెప్పామని అంగీకరించారు. ఇప్పుడు కొహెన్, మనాఫోర్ట్‌ దోషులుగా తేలారు. మాజీ ప్రచార మేనేజర్‌ పాల్‌ మనాఫోర్ట్‌ మరిన్ని కొత్త విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. చట్టవిరుద్ధ చర్యలతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గడాన్ని నేరంగా పరిగణిస్తారు. అదే ట్రంప్‌పై అభిశంసనకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా ఎన్నికల ప్రచారంలో సలహాదారుడిగా పని చేసిన బ్రెయిన్‌ క్లాస్‌ అభిప్రాయపడ్డారు. 

నవంబర్‌ ఎన్నికలే అభిశంసనకు రెఫరెండం
ఈ పరిణామాలన్నీ  నవంబర్‌లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమొక్రాట్లకు లాభిస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎన్నికలే ట్రంప్‌పై అభిశంసనకు ఒక రిఫరెండంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ. డెమొక్రాట్లు రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రతినిధుల సభలో పట్టు పెంచుకుంటే ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌పై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో వీగిపోయింది. చాలా మంది డెమొక్రాట్లే ట్రంప్‌పై అభిశంసన తొందరపాటు చర్య అని అభిప్రాయపడ్డారు. అందుకే వచ్చే నవంబర్‌ ఎన్నికల వరకు డెమొక్రాట్లు ట్రంప్‌ను గద్దె దింపే సాహసం చేసే అవకాశం కనిపించడం లేదు. 

చరిత్రలోకి తొంగి చూస్తే
ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు ఎవరూ అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్‌ క్లింటన్‌లపై  ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పటికీ, సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో వాటర్‌గేట్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రిచర్డ్‌ నిక్సన్‌ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

మార్కెట్లు కుప్పకూలుతాయా ?
అధ్యక్ష పదవి నుంచి తనను తొలగిస్తే స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోతాయని , అమెరికా ప్రజలందరూ నిరుపేదలుగా మారుతారంటూ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ అలాంటిదేమీ జరగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు ట్రంప్‌ను గద్దె దింపడమే సాధ్యం కాదని, అనూహ్యమైన పరిస్థితుల్లో అది జరిగినా మార్కెట్లకి వచ్చే నష్టమేమీ లేదని వారంటున్నారు. ఇప్పటికే ట్రంప్‌ తీసుకువచ్చిన పన్నుల సంస్కరణ, నిబంధనల సవరణ అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరేలా ఉన్నాయని ఇన్వెస్కోలో చీఫ్‌ గ్లోబల్‌ మార్కెట్‌ వ్యూహకర్త క్రిస్టినా హూపర్‌ అభిప్రాయపడ్డారు. పైగా ఇప్పుడు ట్రంప్‌ కొత్తగా ప్రతిపాదిస్తున్న వాణిజ్య విధానాలు మార్కెట్‌కి అనుకూలంగా లేవని ఆమె చెప్పారు. మార్కెట్లపై ట్రంప్‌ అభిశంసన ప్రభావం ఉంటుందనితను అనుకోవడం లేదని ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ జిల్‌ పోల్‌సెన్‌ వ్యాఖ్యానించారు. అనుకోని విధంగా ట్రంప్‌ అభిశంసనకు గురైతే ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ అధ్యక్షుడు అవుతారు. ఆయన దాదాపు ట్రంప్‌ అనుసరించే విధానాలనే కొనసాగిస్తారని మెజారీటీ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top