అతడిని అమెరికా ఎలా చంపిందంటే? | How US Killed Iran Top General Qasem Soleimani | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ కమాండర్‌ను అమెరికా ఎలా చంపిందంటే?

Jan 4 2020 4:53 PM | Updated on Jan 4 2020 4:55 PM

How US Killed Iran Top General Qasem Soleimani - Sakshi

డ్రోన్‌ క్షిపణిల ద్వారా చంపిన విధానం చూస్తే అమెరికా సాంకేతిక సంపత్తి సామర్థ్యం ఏమిటో స్పష్టం అవుతుంది.

న్యూఢిల్లీ : ఇరాన్‌ అత్యున్నత స్థాయి మిలటరీ కమాండర్‌ ఖాసీం సులేమానిని అమెరికా సైనిక సెంట్రల్‌ కమాండ్‌ డ్రోన్‌ క్షిపణిల ద్వారా చంపిన విధానం చూస్తే అమెరికా సాంకేతిక సంపత్తి సామర్థ్యం ఏమిటో స్పష్టం అవుతుంది. సిరియా నుంచి బయల్దేరి ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం దిగిన సులేమాని, ఇరాక్‌లో ఇరాన్‌ తరఫున పనిచేస్తున్న ప్రైవేట్‌ సైన్యం డిప్యూటి కమాండర్‌ అబూ మెహదీ అల్‌ ముహందీస్‌తో కలిసి విమానాశ్రయం కార్గో ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారిద్దరు కలిసి ఒక టయోటా ఎస్‌యూవీలో ఎక్కగా, వారిద్దరు బాడీ గార్డులైన ఎనిమిది మంది మరో టయోటా ఎస్‌యూవీలో ఎక్కి విమానాశ్రయం బయటకు వచ్చారు.

అప్పటికే ఖతార్‌లోని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరిన ‘యూస్‌–ఎంక్యూ 9 రీపర్‌’ డ్రోన్‌’  సులేమాని, అబూ మెహదీ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ కారుపై రెండు లేజర్‌ గైడెడ్‌ క్షిపణిలను, వారి బాడీ గార్డులు వెళుతున్న కారుపైకి మరో క్షిపణిని ప్రయోగించింది. అవి గురితప్పకుండా కార్లను ఢీకొనడంతో పేలుడు సంభవించి రెండు వాహనాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఈ సంఘటనలో రెండు కార్లలో వెళుతున్న మొత్తం పది మంది మరణించారు. సులేమాని శరీర శకలాలను ఆయన చేతి ఉంగరం ద్వారా గుర్తించినట్లు ఇరాన్‌ వర్గాలు తెలిపాయి.

ఇద్దరు పైలెట్లు ఉండే ఈ రీపర్‌ డ్రోన్‌ గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడమే కాకుండా నిశ్శబ్దంగా ప్రయాణించడం విశేషం. ఓ యుద్ధ ట్యాంకును తునాతునకలు చేయగల బాంబు శీర్షాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన నాలుగు ‘హెల్‌ఫైర్‌’ క్షిపణలు ఈ డ్రోన్‌కు అమరుస్తారు. వీటిని నీంజా క్షిపణులుగా కూడా వ్యవహరిస్తారు. ఈ డ్రోన్‌ ఖరీదు ఆరున్నర కోట్ల డాలర్లు. సులేమానిని హతమార్చేందుకు గతంలో అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక 2016 నుంచి సులేమానిపై అమెరికా సైనిక ఇంటెలిజెన్స్‌ పక్కా నిఘాను కొనసాగిస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అమెరికా-ఇరాన్‌ యుద్ధం; భారత్‌కు ముప్పు

ఇరాన్‌ వెన్ను విరిగింది!

ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి

ఇరాన్‌ గగనతలం మీదుగా విమానాలు వెళ్లనివ్వద్దు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement