గాడిదలను చంపేసి చైనాకు పార్సిల్‌

Donkeys Stolen From Africa For Skin, It Demands In China - Sakshi

నైరోబీ: మూగ జీవాలను అమానుషంగా చంపుతుండటంపై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి చైనా పెద్ద ఎత్తున గాడిదల చర్మాలను దిగుమతి చేయించు కోవడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

గాడిద చర్మంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు ఉంటాయని చైనీయులు నమ్ముతారు. వీటి చర్మాలను ఉడికించి ‘ఎజావో’  అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. చైనాలో దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో ఎజావో కారణంగా చైనాలో గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గాడిదల కోసం డ్రాగన్‌ కంట్రీ కన్ను ఇతర దేశాలపై పండింది. ఆఫ్రికాలోని పలు దేశాల నుంచి గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చేయించుకుంటోంది. 

గాడిదలు జాగ్రత్త..!
కెన్యాకు చెందిన జోసెఫ్‌ కమాంజో కరియుకి గాడిదలపై నీటిని తరలిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఆయన గాడిదలను దొంగలు ఎత్తుకెళ్లారు. చైనా కారణంగా తమ దేశంలో వేళ్లూనుకున్న గాడిద చర్మాల బ్లాక్‌ మార్కెట్‌పై కరియుకి గళమెత్తాడు. తన లాగే మరెవరూ జీవనాధారం కోల్పోవద్దనీ, ‘మీ గాడిదలు జాగ్రత్త’అనే నినాదంతో అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడు. ఇప్పుడు గనుక ఈ బ్లాక్‌ మార్కెట్‌ను అడ్డుకోకపోతే.. వచ్చే తరాల వారికి గాడిదల చరిత్రను చెప్పాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘సాధారణంగా గాడిదలను అమ్మకానికి కాకుండా కుటుంబ అవసరాలకోసం, జీవనాధారం కోసం పెంచుతుంటారు. కెన్యాలో గాడిద చర్మాల రవాణాకు అనుమతి పొందిన మూడు కబేళాలు ఉన్నాయి. వీటి చర్మాలకు చైనాలో మంచి డిమాండ్‌ ఉంది. దానికి అనుగుణంగా రోజూ వెయ్యి గాడిదలను చంపి వాటి చర్మాన్ని వలుస్తున్నాం. డిమాండ్‌కు తగ్గట్లు సప్లయ్‌ లేకపోవడంతో.. మధ్యవర్తులు, వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. మంచి ధర చెల్లిస్తుండటంతో వారు గాడిదలను అపహరించి సప్లయ్‌ చేస్తుస్తున్నార’ని ఓ అధికారి చెబుతున్నారు.

కాగా, ఆఫ్రికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వాలు స్పందించాయి. 14 ఆఫ్రికా దేశాలు గాడిదల చర్మం రవాణాపై నిషేదం విధించాయి. గత 9 ఏళ్లుగా కెన్యాలో గాడిదల సంఖ్య మూడోవంతు తగ్గిపోయాయని ఒక సర్వే నివేదిక వెల్లడించింది. గాడిదల సంఖ్య 1.8 మిలియన్‌ నుంచి 1.2 మిలియన్‌కు పడిపోయింది. అధికారికంగా సగటున రోజుకు వెయ్యి గాడిదల చొప్పున చంపుతుండగా, అనధికారికంగా మరెన్నింటిని అంతమొందిస్తున్నారో ఊహించుకోవచ్చు..!!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top