కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ

Donald Trump Talks Mediation On Kashmir Again - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ పాతపాటే పాడారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సు సందర్భంగా కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చిస్తానని ట్రంప్‌ తెలిపారు. వాషింగ్టన్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్తాన్‌లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి.

అయితే ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం బాగోలేవు. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దదేందుకు నా వల్ల వీలైనంతమేరకు ప్రయత్నిస్తాను. అవసరమైతే అందుకోసం మధ్యవర్తిత్వం చేస్తాను’ అని వెల్లడించారు. భారత్‌–పాక్‌ల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లదాఖ్‌)గా విభజించింది.

దీంతో భారత్‌–పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్రంప్‌ ఈ మేరకు స్పష్టం చేశారు. కశ్మీర్‌ ద్వైపాక్షిక సమస్యనీ, ఇందులో మూడోపక్షం జోక్యాన్ని తాము సహించబోమని భారత్‌ ప్రకటించినప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్‌ చెప్పడం గమనార్హం. మరోవైపు తాలిబన్లతో చర్చలపై ట్రంప్‌ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బలపడకుండా అమెరికా బలగాలు అక్కడే మరికొంతకాలం ఉంటాయని ట్రంప్‌ తెలిపారు. ప్రస్తుతం తాము తాలిబన్లతో చర్చలు జరుపుతున్నామనీ, గతంలో ఏ అధ్యక్షుడూ ఈ పనిని చేయలేకపోయారని వ్యాఖ్యానించారు.  

ద్వైపాక్షికమే: బ్రిటన్‌ ప్రధాని
లండన్‌: జమ్మూకశ్మీర్‌ అన్నది భారత్‌–పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని బ్రిటన్‌ తెలిపింది. ఈ సమస్యను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కశ్మీర్, ఉగ్రవాదం, లండన్‌లో భారత హైకమిషన్‌ దగ్గర విధ్వంసం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బోరిస్‌ మాట్లాడుతూ..‘కశ్మీర్‌ సమస్యను భారత్‌–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యగానే బ్రిటన్‌ గుర్తిస్తోంది. దీన్ని ఇరుదేశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. భారత్‌–బ్రిటన్‌లు తమ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది’ అని తెలిపారు.

ఉగ్రవాదమే పెనుముప్పు: మోదీ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్‌తో పాటు యూరప్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని తెలిపారు. ‘ఈ ఉగ్రభూతంపై పోరాడేందుకు మనం సమిష్టిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే తీవ్రవాదం, హింస అసహనం పెచ్చరిల్లకుండా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐఎస్‌) వంటి ఉగ్రవాద సంస్థలు మన గడ్డపై అడుగుపెట్టకుండా నిలువరించగలం’ అని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సు సందర్భంగా మోదీ, బోరిస్‌ కలుసుకోనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top