
పన్నీర్ సెల్వం
తమిళనాడు రాష్ట్ర మంత్రులు నలుగురు బెంగళూరు శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నా డీఎంకే అధినేత్రి జె.జయలలితను ఈ ఉదయం కలిశారు.
చెన్నై/బెంగళూరు: తమిళనాడు రాష్ట్ర మంత్రులు నలుగురు బెంగళూరు శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నా డీఎంకే అధినేత్రి జె.జయలలితను ఈ ఉదయం కలిశారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ కోర్టు శనివారం తీర్పు చెప్పింది. ఆ తరువాత ఆమెను జైలుకు తరలించారు.
జయలలిత జైలుకు వెళ్లడంతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. జయలలితకు జైలు శిక్ష ఖరారైనప్పటి నుంచి కాబోయే సీఎం ఎవరన్న విషయమై చర్చ కొనసాగుతోంది. ప్రధానంగా ఆర్థిక మంత్రి ఓ. పన్నీర్‌సెల్వం, రవాణాశాఖా మంత్రి సెంధిల్ బాలాజీ పేర్లతోపాటు మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ పేరు కూడా వినిపించింది.
ఎంజీఆర్ హయాం నుంచి జయలలితకు అత్యంత విశ్వసనీయపాత్రుడిగా ఉన్న పన్నీర్‌సెల్వం పేరు ఒక్కటే ఈ రోజు వినవస్తోంది. పన్నీర్‌సెల్వంకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడిఎంకె శాసనసభా పక్ష సమావేశం ఈ సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటుంది. పన్నీర్‌సెల్వం పేరు
దాదాపు ఖరారైనట్లు సమాచారం. గతంలో ఆరు నెలలపాటు సిఎంగా చేసిన పన్నీర్‌సెల్వం పేరునే జైలులో తనను కలిసిన నలుగురు మంత్రులకు జయలలిత సూచించినట్లు తెలుస్తోంది.
**