ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) (జీడీఎన్) జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్‌కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ దేశానికి జి.డి.నాయుడు చేసిన సేవా ఎలాంటిదో తెలుసుకుందాం.

1983లో కోయంబత్తూర్‌కు చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో జి.డి.నాయుడు జన్మించారు. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగంలో ఒక విప్లవం సృష్టించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించి ఎంతో కీర్తి సంపాదించారు. దీంతో ఆయన్ను మిరాకిల్ మ్యాన్‌గా ఈ దేశం గుర్తించింది. జి.డి.నాయుడు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.. ఆపై ఆయన సాధించిన విజయాల ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.

చదివింది మూడో తరగతి మాత్రమే
జి. డి. నాయుడు మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరుగానే కాకుండా నిరంతర అన్వేషకుడిగా గుర్తింపు పొందారు. ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో ఎన్నో పరికరాల ఆవిష్కరణలు చేశారు. దక్షిణ భారత్‌లో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పేరు తెచ్చుకున్నారు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. తర్వాత వెంటనే యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించి దాని ద్వారా ద్వారా 1937లో భారత దేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశారు.
జి. డి. నాయుడు తనే సొంతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కెమెరాను తయారు చేశారు. ఆ కెమెరాతో అడాల్ఫ్ హిట్లర్, లండన్‌లో జార్జి రాజు అంత్యక్రియలు (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ వంటి గొప్ప వ్యక్తుల ఫొటోలు తీశారు. ఆయన తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల'లో ఇప్పటికీ ఉన్నాయి.
తొలి ఇంజనీరింగ్ కళాశాల
1944లో పారిశ్రామిక రంగానికి స్వస్తి చెప్పి నాయుడు.. సంఘసేవ వైపు అడుగులు వేశారు. బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశారు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు. ఈ క్రమంలోనే ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించారు. 1974లో అనారోగ్యంతో ఆయన మరణించారు.
ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్‌లో మాధవన్ నటిస్తుండటం విశేషం. వెండితెరపై మిరాకిల్ మేన్‌గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.


