
కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. మరో 6 నెలల్లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచ్చి నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. అందుకు ప్రత్యేకమైన ఒక బస్సును కొనుగోలు చేశారు. ఆ వాహనానికి తీసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ వైరల్‌గా మారింది. తన జీవితంలో ఎంతో సెంటిమెంట్‌గా మిగిలిపోయిన సంఘటన ఈ నంబర్‌ను సూచిస్తుంది.
విజయ్ కొనుగోలు చేసే కారు ధర ఎంత ఉన్నా సరే నంబర్ మాత్రం మారదు.. తన వద్ద ఉన్న ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ ఉంటుంది. TN 14 అనేది సాధారణం. దాని తర్వాత వచ్చే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే మారుతుంటాయి. ప్రస్తుతం అతని ప్రచార వాహనం నంబర్ ప్లేట్ కూడా TN 14 AS 0277 ఉండటం విశేషం. అతని వాహనాలపై 14-02-77 రూపంలో ఒక తేదీని ఎల్లప్పుడూ సూచిస్తుంది.

ఈ నంబర్ వెనుక విజయ్ సెంటిమెంట్ స్టోరీ ఉంది. విజయ్ చెల్లెలు విద్య అదే 14-02-1977లో జన్మించింది. అయితే, 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే ఆమె మరణించింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. విజయ్ వద్ద ఇప్పటికే TN 14 AH 0277, TN 14 AL 0277, TN 14 AM 0277, TN 14 AS 0277 నంబర్ ప్లేట్లతో వాహానాలు ఉన్నాయి.