మహిళలు, పిల్లలను అమ్మేశాడా? | Women, children sold? | Sakshi
Sakshi News home page

మహిళలు, పిల్లలను అమ్మేశాడా?

Aug 15 2016 2:48 AM | Updated on Nov 6 2018 4:42 PM

మహిళలు, పిల్లలను అమ్మేశాడా? - Sakshi

మహిళలు, పిల్లలను అమ్మేశాడా?

గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహిళలు, పిల్లలను సైతం అమ్మేశాడా.., మనుషుల అక్రమ రవాణాకూ పాల్పడ్డాడా అనే కోణంలో సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

* నయీమ్ నివాసాల్లో జరుగుతున్న సోదాల్లో ఆధారాలు   
* గ్యాంగ్‌స్టర్‌కు సహకరించిన వారిని ప్రశ్నిస్తున్న సిట్

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహిళలు, పిల్లలను సైతం అమ్మేశాడా.., మనుషుల అక్రమ రవాణాకూ పాల్పడ్డాడా అనే కోణంలో సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నయీమ్ భూదందాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఇప్పటివరకు అనేక ఆధారాలు వెలుగు చూశాయి. అయితే అధికారులు చేస్తున్న సోదాల సందర్భంగా మహిళలు, చిన్న పిల్లల అక్రమ రవాణా చేసినట్లుగా ఆధారాలను గుర్తించారు. భూసెటిల్‌మెంట్లకు వచ్చే కొంత మంది అనుచరులు మహిళలు, చిన్న పిల్లలను నయీమ్ వద్దకు తీసుకొచ్చేవారని.. అందులో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని సమాచారం.

వారిని ఉపాధి కల్పిస్తామనే ఆశ చూపి ముగ్గులోకి లాగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా సిట్‌కు కొన్ని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వాటిని గోప్యంగా ఉంచుతున్న అధికారులు.. కొంత మంది బాధ్యులను గుర్తించినట్లు తెలిసింది. వారిపై ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)కు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
 
పోలీసు అధికారులపై ఆరా
మరోవైపు నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. నయీమ్ డైరీలో పేర్లున్న పోలీసు అధికారులకు అతడితో ఎలాంటి సంబంధాలున్నాయి. నయీమ్ దందాల్లో వీరి ప్రమేయం ఏమిటనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. ఆదివారం ఏపీ పోలీసు విభాగానికి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని నాలుగు గంటల పాటు విచారించినట్లు తెలిసింది. ఆయన నల్లగొండ జిల్లాలో విధులు నిర్వహించినప్పుడు నయీమ్‌తో సన్నిహితంగా మెలిగారని, భారీగా ఆస్తులు సమకూర్చుకున్నారని ఆరోపణలున్నాయి. నయీమ్‌తో సంబంధమున్న వారందరిపై ఒకట్రెండు రోజుల తర్వాత మూకుమ్మడిగా దాడు లు చేయాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు
రాష్ట్రవ్యాప్తంగా నయీమ్‌కు సం బంధించిన ఇళ్లను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేస్తున్నారు. వాటిలో నిర్వహిస్తున్న సోదాల్లో రూ.వందల కోట్ల ఆస్తులు వెలుగు చూస్తున్నాయి. అంతేకాదు నయీమ్‌కు ఏపీ, గోవా, బెంగళూరు, ఒడి శా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లలోనూ నివాసాలున్నట్లు వెల్లడైంది. అక్కడా ప్రత్యేక బృందాలను పంపి దర్యాప్తు చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement