అనర్హత తీర్పుపై ఏం చేద్దాం?

What should we do on disqualification? - Sakshi

టీఆర్‌ఎస్‌లో తర్జనభర్జన

న్యాయ నిపుణులు, పార్టీ ముఖ్యులతో సీఎం భేటీ

ఆదేశాలు ప్రభుత్వానికా? అసెంబ్లీకా? అన్న దానిపై చర్చ

అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, కార్యదర్శి సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసన సభ్యత్వ రద్దు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడంపై టీఆర్‌ఎస్‌ తర్జనభర్జన పడుతోంది. కోర్టు తీర్పు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో అత్యున్నత చట్టసభగా శాసనసభ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, న్యాయ నిపుణులు, పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో సీఎం సమావేశమయ్యారు.

ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందా, అసెంబ్లీని ఆదేశించిందా అన్న దానిపై స్పష్టత తీసుకుంటున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా అన్న అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది శాసనసభ అయితే, హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

అనర్హత వేటు వేసిన శాసనసభ మాత్రమే దీనిపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రభుత్వానికి సంబంధమే లేదని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అంటున్నారు. ఇద్దరు సభ్యులపై వేటు వేయడంలోనూ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనూ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

న్యాయ నిపుణులేమంటున్నారు?
ప్రభుత్వానికి సంబంధం లేని నిర్ణయాన్ని అమలుచేసే అధికారం ఎలా ఉంటుందని న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తున్నారు. కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ నిర్ణయమైనా అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

అయితే చట్టపరంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై గులాబీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది శాసనసభా, ప్రభుత్వమా అన్న సాంకేతిక అంశాలను పక్కనబెడితే రాజకీయ వర్గాల్లో చోటుచేసుకోనున్న పరిణామాలనూ అధికార పార్టీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

స్పీకర్, చైర్మన్, కార్యదర్శి అత్యవసర భేటీ
హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. స్పీకర్‌ కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లోని చట్టసభలు గతంలో ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన సందర్భాలు, ఆ సమయంలో ఆయా సభలు వ్యవహరించిన తీరుపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ఈ అంశంపై గతంలోని ఉదాహరణలను అధ్యయనం చేసి, నివేదికను అందజేయాలని కార్యదర్శికి స్పీకర్‌ సూచించారు.

అధ్యయనం తర్వాతే నిర్ణయం: స్పీకర్‌
హైకోర్టు తీర్పులో ఏముందో అధ్యయనం చేసిన తర్వాతే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి వెల్లడించారు. న్యాయ నిపుణులతో సమగ్రంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మాట్లాడతామని, అప్పటిదాకా మాట్లాడేదేమీ లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై స్పందించేందుకు వి.నర్సింహాచార్యులు కూడా నిరాకరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top