‘కాళేశ్వరం’ వైఫల్యంలో బాధ్యులు వారే! | Justice Pinaki Chandra Ghose Commission Report On Kaleswaram Project | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ వైఫల్యంలో బాధ్యులు వారే!

Aug 3 2025 1:36 AM | Updated on Aug 3 2025 1:36 AM

Justice Pinaki Chandra Ghose Commission Report On Kaleswaram Project

‘కాళేశ్వరం’ వైఫల్యంలో కేసీఆర్, హరీశ్‌, ఈటల, అధికారులు, ఇంజనీర్ల పాత్ర 

సర్కారుకు సమర్పించిన నివేదికలో జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌?

ప్రత్యక్షంగా, పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వల్లే బరాజ్‌ల వైఫల్యం 

ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ సంబంధిత అవకతవకల్లో పాత్ర 

అంచనాల పెంపు, ఒప్పందాల సవరణ, గ్యారెంటీల విడుదలకు ఒత్తిడి చేశారు 

కేఐపీసీఎల్‌ ముసుగులో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషీ, నాటి సీఎం కేసీఆర్‌ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్‌) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్‌ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. 

నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో    బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్‌ అడ్జస్ట్‌మెంట్‌), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్‌ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్‌ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది. మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్‌ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. 

కేసీఆర్‌ రెండు విధాలుగా బాధ్యుడు! 
విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆర్‌ డైరెక్ట్‌గా, వైకారియస్‌గా బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్‌ పేర్కొంది. న్యాయ పరిభాషలో వైకారియస్‌ అంటే సేవకులు చేసే తప్పిదాలకు యజమాని (మాస్టర్‌) పరోక్ష బాధ్యత వహించడం. అంటే సహచర మంత్రులతో పాటు ఐఏఎస్‌ అధికారులు, ఇంజనీర్లు చేసిన తప్పిదాలకు సీఎంగా కేసీఆర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్‌ పేర్కొంది. ఇక ప్రత్యక్షంగా కూడా కేసీఆర్‌ పలు అవకతవకలకు పాల్పడినట్టు తెలిపింది.  

ఈటల, హరీశ్‌లది బాధ్యతారాహిత్యం! 
నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ బాధ్యతలను గాలికి వదిలేశారని, కేఐపీసీఎల్‌ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా పూర్తి బాధ్యతలను ఆ సంస్థకే వదిలేశారని కమిషన్‌ తప్పుబట్టింది. ఇక హరీశ్‌రావు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా ఆదేశాలు జారీ చేశారని, పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేశారని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిందని కమిషన్‌ పేర్కొంది. దీనికి గతంలో, ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్న వారందరూ బాధ్యులేనని స్పష్టం చేసింది. నేరపూరిత విశ్వాసఘాతం, నిధుల దురి్వనియోగానికి వీరంతా బాధ్యులని పేర్కొంది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపింది.  

ఇష్టారాజ్యంగా వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్లు! 
‘మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణం పూర్తికాక ముందే దాదాపుగా పూర్తైందని నిర్థారిస్తూ 2019 సెప్టెంబర్‌ 9న బరాజ్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సబ్‌స్టాన్షియల్‌ వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణం పూర్తైందని మళ్లీ 2021 మార్చి 15న మరో సర్టిఫికెట్‌ ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలు/లీకేజీలపై నిర్లక్ష్యం వహించి అవి సైతం పూర్తైనట్టు ఆయా బరాజ్‌ల క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్లు సర్టిఫికెట్లు జారీ చేశారు..’ అని కమిషన్‌ పేర్కొంది. ఇక బరాజ్‌ల నిర్వహణ, పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనందుకు గాను మాజీ ఈఎన్సీ (ఓ అండ్‌ ఎం) బి.నాగేంద్ర రావుతో పాటు డ్యామ్‌ సేఫ్టీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  

వాస్తవాలను తొక్కిపెట్టిన మాజీ ఈఎన్సీలు 
బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి? లంప్‌సమ్‌ విధానంలో చేసుకోవాలా? టర్న్‌ కీ విధానంలోనా? అనే విషయంలో..మాజీ ఈఎన్సీ(జనరల్‌) సి.మురళీధర్, మాజీ సీఈ బి.హరిరామ్‌ వాస్తవాలను తొక్కిపెట్టారని కమిషన్‌ పేర్కొంది. నీటి లభ్యత విషయంలో నిపుణుల కమిటీ నివేదికను విస్మరించి కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) తప్పుదోవ పట్టించారని వెల్లడించింది. ఇక కమిషన్‌ ముందు హాజరై తప్పుడు సాక్ష్యం ఇచ్చిన సీడీఓ మాజీ సీఈ ఎ.నరేందర్‌ రెడ్డి, సీఈ టి.శ్రీనివాస్, కాళేశ్వరం బరాజ్‌ మాజీ ఈఈ ఓంకార్‌ సింగ్‌లను కమిషన్‌ తప్పుబట్టింది. 

నివేదిక తొక్కిపెట్టిన జోషి..బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘించిన స్మిత 
మేడిగడ్డ బరాజ్‌ నిర్మించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ సమర్పించిన కీలక నివేదికను ఎస్‌కే జోషీ తొక్కిపెట్టారని కమిషన్‌ పేర్కొంది. లేనిపక్షంలో బరాజ్‌ నిర్మాణం జరగక పోయేదని అభిప్రాయపడింది. ఇక స్మిత సభర్వాల్‌ బరాజ్‌ల నిర్ణయాలకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను కేబినెట్‌ ముందుంచడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె బిబినెస్‌ రూల్స్‌ను ఉల్లంఘించారని పేర్కొంది.  

ఎల్‌ అండ్‌ టీకి ఆ అర్హత లేదు 
మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణం పూర్తైందని నిర్ధారిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్‌ను పొందడానికి నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీకి అర్హత లేదని కమిషన్‌ పేర్కొంది. బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌ను తన సొంత ఖర్చుతో ఆ సంస్థ పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. డిఫెక్ట్‌ లయబిలిటీ కాలంలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ఏర్పడిన లోపాలను గుర్తించి సరిచేయడంలో విఫలమైనందుకు ఆ రెండు బరాజ్‌ల నిర్మాణ సంస్థలూ బాధ్యత వహించాలని పేర్కొంది.  

బాధ్యులైన ఇంజనీర్లు వీరే.. 
మోడల్‌ స్టడీస్‌ నిర్వహించకుండానే డిజైన్ల తయారీ, నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం, థర్డ్‌ పార్టీతో డిజైన్లకు వెట్టింగ్‌ చేయించకపోవడం, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను నీటిపారుదల శాఖలోని పలు విభాగాల ఇంజనీర్లను కమిషన్‌ బాధ్యులుగా తేల్చింది. విభాగాల వారీగా వారి పేర్లను ప్రస్తావించింది.. 
– సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ నాటి చీఫ్‌ ఇంజనీర్‌ 
– తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ 
– కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ 
– సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement