వజ్ర బస్సులు నష్టాలు తెచ్చిపెడుతుండటంతో ఆర్టీసీ ఒక్కో లోపాన్ని సరిదిద్దుకుంటూ వస్తోంది.
‘సాక్షి’ కథనానికి స్పందించిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: వజ్ర బస్సులు నష్టాలు తెచ్చిపెడుతుండటంతో ఆర్టీసీ ఒక్కో లోపాన్ని సరిదిద్దుకుంటూ వస్తోంది. బస్టాండ్లకు వెళ్లకుండా కేవలం కాలనీల గుండా మాత్రమే తిప్పాలన్న వింత నిర్ణయానికి ఎట్టకేలకు అధికారులు స్వస్తి పలికారు. వజ్ర బస్సుల్లో వైఫల్యాలు ఎత్తిచూపుతూ అవి బస్టాండ్లకు వచ్చి వెళ్తేనే ప్రయాణికుల ఆదరణ ఉంటుందని పేర్కొంటూ ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కథనం ప్రచురితమైన వెంటనే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అధికారులతో సమీక్షించి ప్రధాన మార్పులుచేర్పులు సూచించారు.
ఈ మేరకు మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌ల నుంచి నిజామాబాద్ వెళ్లే వజ్ర మినీ బస్సులు ఇక నుంచి జూబ్లీ బస్‌స్టేషన్ వెలుపల ఉండే సిటీ బస్టాప్‌లో ఆగి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లనున్నట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ప్రకటించారు. మార్గమధ్యంలో ప్రయాణికులు ఆపితే వారిని ఎక్కించుకోవాలని, ప్రధాన బస్టాండ్ల వద్దకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకోవాలన్న ఆయన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఇటీవలే తొలి సూచనను అమలుచేయగా తాజాగా రెండో సూచనను అమలు చేయాలని నిర్ణయించారు.
వజ్ర బస్సుల ప్రయాణ సమయాలు
నిజామాబాద్ వర్ని చౌరస్తావైపు వెళ్లే బస్సులు ఉదయం 5.50, 8.10, 9.35, 11.10, మధ్నాహ్నం 12 గంటలు, 3.20, సాయంత్రం 5.05, రాత్రి 8.20, 9.15, 9.40 గంటలకు, ముబారక్ నగర్ వైపు వెళ్లే బస్సులు ఉదయం 6.25, 7.35, మధ్నాహ్నం 12.40, 2.35, సాయంత్రం 4.15, 7.10 గంటలకు జూబ్లీ బస్టాండ్ వద్దకు వస్తాయని రమణారావు తెలిపారు. తిరుగు ప్రయాణంలో వర్ని చౌరస్తా వద్ద ఉదయం 6.40, 7.25, 9.20, 11.35 మధ్యాహ్నం 2.05, సాయంత్రం 4.35, 6.45, రాత్రి 8.30, ముబారక్‌నగర్ నుంచి జేబీఎస్‌కు ఉదయం 4.40, 6.00, 9.50, 11.05, మధ్యాహ్నం3.05, సాయంత్రం 4.05, 6.05, 7.55లకు బయలుదేరతాయని తెలిపారు.