బోదకాలు... బాధలు

ఇంకా అందని ఆసరా పింఛన్లు

బోదకాలు బాధితులకు గ్రేడ్‌ల దెబ్బ

రాష్ట్రవ్యాప్తంగా 46 వేల మంది బాధితులు

13 వేల మందికే వర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: బోదకాలు బాధితులకు ఆసరా లభించడంలేదు. వారికి ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున ‘ఆసరా’పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఏప్రిల్‌ నుంచి ఈ పింఛన్లను అమలు చేయాలని, మేలో రెండు నెలల మొత్తాన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. మే నెల పూర్తి కావస్తున్నా ఇంకా వారికి పింఛన్లు చెల్లించలేదు. మండల అధికారులను అడిగితే ఇంకా వివరాలు రాలేదని, ఎప్పటి నుంచి పింఛన్లు చెల్లించేది చెప్పలేమని అంటున్నారు.

బోదకాలు సమస్యతో ఏ పనీ చేయలేని దుస్థితిలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. కూలీ పనులకు కూడా వీరిని ఎవరూ పిలవరు. పేద కుటుంబాల్లోని బోదకాలు బాధితులు సాధారణ జీవనం గడపడం గగనమైంది. రోజూ మందులు వాడేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా వందల రూపాయల ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో బోదకాలు బాధితులకు ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున పింఛన్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల నిర్ణయించారు.

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల జాబితాను గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలని వైద్య, ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,084 మందికి బోదకాలు బాధితుల పింఛన్‌ ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది.

గ్రేడ్‌లతో మెలిక...
బోదకాలు బాధితులకు ఆసరా పింఛన్‌ ఇచ్చే విషయంలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా కాకుండా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేవిధంగా అధికారులు నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వం ముందుగా సేకరించిన సమాచారం ప్రకారం 46,476 వేల మంది బోదకాలు బాధితులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. అధికారుల నిర్వాకంతో చాలామంది బాధితులు పింఛన్లకు దూరమయ్యారు.

ఆసరా పింఛన్ల ప్రకటన తర్వాత లబ్ధిదారుల గుర్తింపు కోసం అధికారులు గ్రేడ్‌ల నిబంధన తెచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే పింఛన్‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోద కాలు వ్యాధి తీవ్రత దృష్ట్యా గ్రేడ్‌ 3, గ్రేడ్‌ 2 దశలో ఉన్నవారికి ఎక్కువ ఇబ్బంది ఉంటుందని, వీరిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించడంతో వారి సంఖ్య 13,084కు తగ్గింది.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top