కార్మిక హక్కులు కాలరాస్తున్నారు

కార్మిక హక్కులు కాలరాస్తున్నారు - Sakshi


మోదీ సర్కార్‌పై నారాయణ ఫైర్  

వియత్నాం కమ్యూనిస్టు

మహాసభలో ప్రసంగం


సాక్షి, హైదరాబాద్: కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను వారికి దక్కకుండా చేయడమే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల ముఖ్య ఉద్దేశమని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ విమర్శించారు. కార్మిక చట్టాలకు సవరణలు తీసుకొచ్చి పారిశ్రామిక, పెట్టుబడిదారి అనుకూల విధానాలను అమలు చేస్తామంటూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పదే పదే పారిశ్రామికవేత్తలకు హామీనిస్తున్నారన్నారు.

 

వియత్నాం హనోయిలో జరుగుతున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల మహాసభకు సీపీఐ ప్రతినిధిగా నారాయణ హాజరయ్యారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. భారత్‌లో పాలకపక్షం అమలు చేస్తున్న పెట్టుబడిదారి, కార్పొరేట్ అనుకూల విధానాలు, మతతత్వ వ్యాప్తికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలసి సీపీఐ వివిధ రూపాల్లో పోరాడుతోందన్నారు. కార్మికులు, రైతులు, మహిళలు, యువత విద్యార్థులతో కలసి తమ పార్టీ విస్తృతంగా ఆందోళలు చేస్తోందన్నారు.



భారత్‌లోని విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక, భావజాల పోరుకు యుద్ధక్షేత్రాలుగా మారుతున్నాయని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్శిటీల్లో ఫాసిస్ట్ సిద్ధాంతాలను జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ పోరాటాలన్నీ మరింత విస్తృత ప్రాతిపదికన వామపక్ష, సెక్యులర్, ప్రజాస్వామ్య శక్తులు ఏర్పడేందుకు మార్గాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top