పెళ్లి సంబంధం పేరుతో నయావంచన | Man arrested in theft of 85 cellphones | Sakshi
Sakshi News home page

పెళ్లి సంబంధం పేరుతో నయావంచన

Oct 29 2013 9:32 AM | Updated on Oct 8 2018 5:45 PM

పెళ్లి సంబంధం మాట్లాడుకుందామని పిలిచి.. సెల్‌ఫోన్లు ఎత్తుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు.

 

= సెల్‌ఫోన్లు ఎత్తుకుపోతున్న కేటుగాడు
 =నిందితుడి అరెస్టు.. 85 సెల్‌ఫోన్లు స్వాధీనం

 
నాంపల్లి, న్యూస్‌లైన్: పెళ్లి సంబంధం మాట్లాడుకుందామని పిలిచి.. సెల్‌ఫోన్లు ఎత్తుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు 85 వివిధ రకాల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పశ్చిమ మండలం డీసీపీ జీపీ వినోద్‌కుమార్, టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్‌తో కలిసి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు.  

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సాధిక్ అలియాస్ సాజిత్ అలియాస్ అబ్దుల్లా(38) వృత్తిరీత్యా డ్రైవర్. మహారాష్ట్రలో కూడా పలు పోలీస్‌స్టేషన్లలో ఇతనిపై కేసులున్నాయి. మహారాష్ట్ర జరిగిలో మతఘర్షణల్లో ఇతను నిందితుడు. ఇదే క్రమంలో ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహ్మద్ సాధిక్ ఓ ముస్లిం యువతిని వివాహం చేసుకుని నగరంలోనే జీవిస్తున్నాడు. జైలుకు వెళ్లి వచ్చినా నేరాలు చేయడం మానుకోలేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించేందుకు సాధిక్ ఓ పథకం పన్నాడు.

ఉర్దూ దినపత్రికల్లో వచ్చే పెళ్లి సంబంధాల క్లాసిఫైడ్స్‌ను చదివి... అందులో ఉన్న ‘వరుడు కావలెను’ అనే క్లాసిఫైడ్‌లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేసేవాడు. తాను యూకే నుంచి వచ్చానని, తన కుమారుడు మెడిసన్ చదువుతున్నాడని, సంబంధం కోసం మీతో మాట్లాడాలని చెప్పేవాడు. మరికొందరిని తాను మహ్మద్ ఖాన్ జువెలర్స్ యజమాని స్నేహితుడినని ఫోన్ చేసి పరిచయం చేసుకొనేవాడు. పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు వచ్చిన వారిని సమీపంలోని ఏదైన మసీదుకు వద్దకు రప్పించేవాడు.  

ప్రార్థనలకు సమయం అవుతోందని, పార్థన చేసుకొని వచ్చి మాట్లాడుకుందామని చెప్పేవాడు. స్నేహితుడికి ఫోన్ చేయాలని, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ పని చేయడంలేదని, మీ ఫోన్ ఇస్తే బయటకు వెళ్లి మాట్లాడతానని తీసుకొనేవాడు. ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించేవాడు.  ఇలా గత నాలుగు నెలల్లో వంద మందికి టోకరా ఇచ్చాడు. బాధితుల్లో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.  ఇదే క్రమంలో అహ్మద్ సల్మాన్ అనే న్యాయవాదికి చెందిన ఖరీదైన ఫోన్ తీసుకొని ఉడాయించాడు.

సదరు న్యాయవాది టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సాధిక్‌ను అరెస్టు చేశారు.  సాధిక్ చేతిలో మోసపోయిన బాధితులు తమ సెల్‌ఫోన్ ఆధారాలను టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌లో చూపించి.. పోయిన తమ సెల్‌ఫోన్‌ను పొందవచ్చని డీసీపీ తెలిపారు. ఓ కేసు విషయంలో తాను రౌడీషీటర్ కౌసర్‌నని, రాజీ చేస్తానని ఓ వ్యక్తి వద్ద నుంచి సాధిక్ రూ.10 లక్షలు దండుకున్నట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement