నీటి విడుదలకు నో! | Krishna board rejected the Ap,telangana Appeal | Sakshi
Sakshi News home page

నీటి విడుదలకు నో!

Jul 21 2016 4:24 AM | Updated on Sep 29 2018 5:21 PM

నీటి విడుదలకు నో! - Sakshi

నీటి విడుదలకు నో!

కృష్ణా జలాల అంశంపై బోర్డు త్రిసభ్యకమిటీ భేటీలోనూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

తెలంగాణ, ఏపీల విజ్ఞప్తిని తిరస్కరించిన కృష్ణా బోర్డు
- 16 టీఎంసీలు ఇవ్వాలన్న ఏపీ, ఏడు టీఎంసీలు కోరిన తెలంగాణ
- నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరడాన్ని ఎత్తిచూపిన బోర్డు సభ్య కార్యదర్శి
- దీనిపై ఇరు రాష్ట్రాల కార్యదర్శులతో చర్చించి నిర్ణయిస్తామని స్పష్టీకరణ
- కృష్ణా జలాల వినియోగం అంశంపై కుదరని ఏకాభిప్రాయం
- కేంద్ర కమిటీ నివేదిక ఆధారంగా ‘టెలీమెట్రీ’ వ్యవస్థ ఏర్పాటు
 
 సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల అంశంపై బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్‌సాగర్ పథకాల ట్రయల్ రన్‌కు కలిపి ఏడు టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ కోరగా... సాగు, తాగునీటి అవసరాలు, పుష్కరాల కోసం తక్షణమే 16 టీఎంసీలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస స్థాయికి మించి పడిపోయిన నేపథ్యంలో... రాష్ట్రాలు కోరుతున్నట్లుగా నీటి విడుదల సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ స్పష్టం చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ ఈఎన్‌సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు వినియోగించుకుంటామని తెలంగాణ కోరింది. భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు కనీసం నాలుగు టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయాయని.. దీంతో భారీగా వరద జలాలు అందుబాటులోకి వస్తాయని వివరించింది.

గతేడాది నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేయాలన్న బోర్డు ఆదేశాలు అమలుకాకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. వాటిని ఈ ఏడాది సర్దుబాటు చేయాలని కోరింది. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ కింద సాగు అవసరాలకు 8 టీఎంసీలు.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం 4 టీఎంసీలు, కృష్ణా పుష్కరాల కోసం మరో 4 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ కోరింది. ఈ ప్రతిపాదనలను సమీర్ చటర్జీ తోసిపుచ్చారు. శ్రీశైలం, సాగర్‌లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జలాలను విడుదల చేయలేమని తేల్చిచెప్పారు.
 
 కేంద్ర కమిటీ నివేదిక తర్వాతే..
 తెలంగాణ, ఏపీల పరిధిలో కృష్ణా జలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించేందుకు టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటుపై బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించింది. కల్వకుర్తి, కోయల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, జూరాల, ఎలిమినేటి మాధవరెడ్డి, హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు కోరింది. శ్రీశైలం కుడికాలువ, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ కుడికాలువ, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీల వద్ద టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిపై బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ స్పందిస్తూ.. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) రిటైర్డు చైర్మన్లతో కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించి, ఇరు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలన్న అంశంపై నివేదిక ఇస్తుందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగానే టెలీమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేసి, నీటి వినియోగాన్ని లెక్క కడతామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement