తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు.. ఖాళీ బిందెలతో ఆందోళన
సత్యసాయి జిల్లాలో రెండుచోట్ల నిరసన
రొళ్ల/మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వేసవి రాకముందే పలు గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. దీంతో తరచూ ఏదో ఒక గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా గురువారం మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యం కాలనీ, రొళ్ల మండలం కొడగార్ల గుట్ట (కేజీ గుట్ట) కాలనీ మహిళలు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
మడకశిర వడ్రపాళ్యం కాలనీలో 20 రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరు మోటారు కాలిపోవడంతో సమస్య ఏర్పడింది. అప్పటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు గురువారం ఖాళీ బిందెలతో మడకశిర–హిందూపురం ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
దీంతో గంటల తరబడి వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు వచ్చి ఆందోళన విరమించాలని కోరగా.. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు భీష్మించారు. చివరకు మున్సిపల్ అధికారులు వచ్చి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.
కేజీ గుట్టలోనూ ఇదే సమస్య
మరోవైపు రొళ్ల మండలం కొడగార్ల గుట్ట (కేజీ గుట్ట) కాలనీకి వారం రోజులుగా నీటి సరఫరా బంద్ అయ్యింది. 10 రోజుల క్రితం వాటర్‌స్కీమ్ బోరుబావి వద్ద కేబుల్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించుకుపోవడంతో సమస్య తలెత్తింది. అప్పటినుంచి సమస్య పరిష్కారానికి ఎవరూ చొరవ చూపలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు గురువారం రొళ్ల–మడకశిర జాతీయ రహదారి (544ఈ)పై ఖాళీ బిందెలు, మొద్దులు, రాళ్లు, ముళ్లకంపలు ఉంచి రాస్తారోకో చేపట్టారు.
దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ గౌతమి సిబ్బందితో వచ్చి మహిళలతో మాట్లాడారు. నీటి సమస్య తీర్చే వరకు కదలబోమని వారు తెగేసి చెప్పగా.. ఎస్‌ఐ సంబంధిత శాఖ అధికారులతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇప్పించారు. దీంతో మహిళలు అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులకు సమస్యను వివరించారు. ఒక్క రోజులోనే సమస్య పరిష్కరిస్తామని డిప్యూటీ ఎంపీడీఓ సుధాకర్ హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.


