తాత్కాలిక పంపిణీ అంశాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగించాలి
పోతిరెడ్డిపాడు, బనకచర్ల అవుట్‌లెట్లపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి
పోలవరం–నల్లమల్లసాగర్ డీపీఆర్ తయారు చేయకుండా ఏపీని నిలువరించాలి
శ్రీశైలం జలాశయానికి తీవ్ర ముప్పు.. అత్యవసర మరమ్మతులు జరపాలి
తెలంగాణ వాడుకోని కోటాను మరుసటి ఏడాదికి బదిలీ చేయాలి
బేసిన్ బయటకు ఏపీ తరలిస్తున్న జలాలను ఆ రాష్ట్ర వాటా కింద లెక్కించాలి
కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో చర్చించాలని ప్రతిపాదించిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపు అంశం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఆలోగా తాత్కాలిక పంపిణీ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగించేలా కేంద్ర జలశక్తి శాఖను కోరుతూ మరోసారి తీర్మానం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. త్వరలో జరగనున్న 21వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా బోర్డుకు లేఖ రాశారు.
ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటును కొనసాగించాలని 19వ కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మినట్స్‌లో రికార్డు చేయడంపై లేఖలో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని ఆ సమావేశంలో తాము గట్టిగా పట్టుబట్టామని గుర్తుచేసింది. కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగించాలని 17వ బోర్డు సమావేశంలో తీర్మానించారని.. 21వ బోర్డు భేటీలో మళ్లీ తీర్మానించాలని ప్రతిపాదించింది.
తెలంగాణ ప్రతిపాదించిన ఎజెండాలోని ఇతర కీలకాంశాలు..
పోతిరెడ్డిపాడు, బనకచర్లపై టెలీమెట్రీలు...
రెండో విడత కింద ప్రతిపాదించిన టెలిమెట్రీ కేంద్రాలతోపాటు మూడో విడత కింద మరో 11 చోట్ల వాటిని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తెలంగాణ రూ. 4.15 కోట్లను కృష్ణా బోర్డుకు విడుదల చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకు ఏపీ లైనింగ్ పనులు చేస్తుండటంతో పోతిరెడ్డిపాడు నుంచి ఆ రాష్ట్రం భారీ మొత్తంలో తరలించుకునే నీటిని కచి్చతంగా లెక్కించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు, బనకచర్ల కాంప్లెక్స్ అవుట్‌లెట్ల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
పోలవరం విస్తరణను అడ్డుకోవాలి..
పోలవరం–నల్లమల్లసాగర్ అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ టెండర్లు నిర్వహించకుండా అడ్డుకోవాలి. ప్రాజెక్టు ప్రీ–ఫీజిబులిటీ నివేదికను బోర్డు పరిశీలించరాదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘానికి తెలియజేశాం. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగు గంగ, ఎస్కేప్ చానల్ నిప్పుల వాగు ద్వారా ఏపీ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలిస్తున్న జలాలను ఆ రాష్ట్ర వాటాల కింద లెక్కించాలి.
శ్రీశైలానికి అత్యవసర మరమ్మతులు..
శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్‌కు ఏర్పడిన భారీ గుంతతో డ్యామ్ భద్రత ప్రమాదంలో పడిందని నిపుణుల కమిటీ నివేదిక ఇచి్చంది. రెండేళ్లు పూర్తయినా ఏపీ మరమ్మతులు చేపట్టలేదు. తక్షణమే డ్యామ్‌కు మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి. పనులను కృష్ణా బోర్డు పర్యవేక్షించాలి. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు నిర్వహించాలి. ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలి. ఎన్జీటీ తీర్పును ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పనుల విషయంలో ఏపీ ముందుకు పోతోంది. వాస్తవ పరిస్థితిపై బోర్డు నివేదిక తెప్పించుకోవాలి. అనుమతి లేకుండా ఏపీ చేపట్టిన ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వ లైనింగ్ పనులపై నివేదిక కోరాలి.
వచ్చే ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి
నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలను లెక్కిస్తేనే కాల్వ ద్వారా ఏపీ, తెలంగాణ వాడుకుంటున్న నీళ్లపై కచి్చతమైన గణాంకాలు తెలుస్తాయి. నష్టాలను లెక్కించడానికి గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిపై తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి. తెలంగాణ నీళ్లను పొదుపుగా వాడుకొని వచ్చే నీటి సంవత్సరంలోని ప్రారంభ మాసాల అవసరాల కోసం నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వ చేస్తోంది. ఇలా ఒక సంవత్సరంలో పొదుపు చేసిన జలాలను రాష్ట్రం వచ్చే ఏడాది వాడుకోవడానికి వీలు కల్పించాలి. తాగునీటి కోసం వాడుకుంటున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించి మిగిలిన 80 శాతాన్ని రిటర్న్ ఫ్లోగా పరిగణిస్తూ మినహాయింపు కల్పించాలి.
సాగర్‌ను తెలంగాణకు అప్పగించాలి
నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తెలంగాణకు తిరిగి అప్పగించాలి. 2023 నవంబర్ 29న ఏపీ బలవంతంగా సాగర్‌పై చొచ్చుకు వచ్చి కుడి రెగ్యులేటర్ ద్వారా నీళ్లను విడుదల చేసుకుంది. డ్యామ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 16 (1) ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ పరిధిలోకే వస్తుంది. మరమ్మతులు నిర్వహించేందుకు తెలంగాణ అధికారులను అనుమతించకపోవడంతో డ్యామ్ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది.


