పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్ | Infants to be recognised under Aadhar at birth | Sakshi
Sakshi News home page

పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్

Oct 14 2016 2:12 AM | Updated on Sep 4 2017 5:05 PM

పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్

పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్

ఇకపై పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్ నమోదు తప్పనిసరి కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్‌సీ) ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.

అన్ని ఆస్పత్రులు, పీహెచ్‌సీలలో అమలు చేయాలి: కేంద్ర ప్రభుత్వం

 సాక్షి, హైదరాబాద్: ఇకపై పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్ నమోదు తప్పనిసరి కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్‌సీ) ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. నవజాత శిశువులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, పాఠశాలల విద్యార్థుల ఆధార్ నమోదుకు అవసరమైన కిట్లను అందుబాటులోకి తేవాలని పేర్కొంది. వాటి కొనుగోలుకు అవసరమైన వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని సూచించింది. రాష్ట్రంలో 100 శాతం ఆధార్ నమోదు లక్ష్య సాధనకు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ఐటీ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

2017 మార్చి వరకు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్ణీత గడువులోగా 100 శాతం ఆధార్ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆధార్ నమోదు ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదని... ముఖ్యంగా 0-5 ఏళ్లలోపు పిల్లల ఆధార్ నమోదు జరగడం లేదని కేంద్రం పేర్కొంది. మరోవైపు 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రి క్ వివరాలను కచ్చితంగా అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది.

విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసేందుకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆధార్ యాక్టు-2016 నోటిఫికేషన్‌ను ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో దేశంలో 100 శాతం ఆధార్ అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, పౌర సేవలన్నింటినీ ఆధార్‌కు అనుసంధానించేందుకు చర్యలు చేపట్టింది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన ప్రతి బిడ్డ ఆధార్ నమోదుకు పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో 25 ఆస్పత్రుల్లో ఆధార్ నమోదుకు ప్రణాళికలు రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement