
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం ఐదోరోజూ కొనసాగాయి. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తుండడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.
తమ న్యాయపరమైన డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇచ్చేవరకూ ఆందోళన విరమించే ప్రసక్తేలేదంటున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి తమ డిమాండ్ల పరిష్కారంలో స్పష్టమైన హామీ ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ వైద్యుల శిబిరం వద్దకు వెళ్లి తన సంఘీభావం తెలిపారు.