తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పోత్సహించడం జుగుప్సాకరమని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పోత్సహించడం జుగుప్సాకరమని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవహేళన చేసేలా అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పాల్పడుతున్న ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు గ్రహించాలని జానారెడ్డి అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నచందంగా టీఆర్ఎస్ వ్యహరిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటున్న ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేలా కేంద్రం, సుప్రీం కోర్టు వ్యవహరిస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజలు తీవ్రమైన కరువుతో అల్లాడిపోతుంటే కేసీఆర్ బాధ్యతలను విస్మరించి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు స్వార్థంతోనే టీఆర్ఎస్లోకి వెళుతున్నారని అన్నారు. ప్రతిపక్షం ఉండకూడదనే ఎజెండాతోనే సీఎం కేసీఆర్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.